34వేల మంది కార్మికులకు ఒక్కరే డాక్టర్

34వేల మంది కార్మికులకు ఒక్కరే డాక్టర్

34వేల మంది కార్మికులకు ఒక్కరే డాక్టర్

జహీరాబాద్ ఇండస్ట్రియల్​ ఏరియా డిస్పెన్సరీలో అరకొర సౌలతులు

సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు : జహీరాబాద్ ఈఎస్ఐ డిస్పెన్సరీలో అరకొర  సౌలతులతో కార్మికులు, వారి కుటుంబాలకు  సరైన  వైద్యం అందడం  లేదు.  ప్రతీ రోజు సుమారు 200 మంది దాక పేషెంట్లు వస్తున్నా  ఒక డాక్టర్​తోనే  నెట్టుకొస్తున్నారు. ఈ డిస్పెన్సరీకి  వచ్చే  కార్మిక కుటుంబాలకు ప్రభుత్వ దవాఖానాల్లో సాధారణ పేషెంట్లకు ఇచ్చే మందులు తప్పా స్పెషాలిటీ వైద్య సేవలు ఏవీ అందుబాటులో లేవు. జహీరాబాద్ ఇండస్ట్రియల్​ ఏరియాలో సుమారు 34 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.  అయినా ఈఎస్ఐ హాస్పిటల్ లేకపోవడంతో  కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ  హాస్పిటల్​ ఏర్పాటుకు చాన్స్​ ఉన్నప్పటికీ  డిస్పెన్సరీని మాత్రమే నడిపిస్తున్నారు. దీంతో కార్మికులకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందడం లేదు. 50 బెడ్ల హాస్పిటల్ ఏర్పాటు చేస్తే స్పెషలిస్టులతో  వైద్యం అందించవచ్చని కార్మిక వర్గాలు అంటున్నాయి.

జిల్లాలో 6 డిస్పెన్సరీలు.. 

జిల్లాలో జహీరాబాద్, బొల్లారం, పటాన్ చెరు,  పాటి ఘనపూర్, ఇస్నాపూర్, సదాశివపేట ప్రాంతాల్లో డిస్పెన్సరీలు ఉన్నాయి. పటాన్ చెరు  నియోజకవర్గం రామచంద్రాపురంలో  మాత్రమే ఈఎస్ఐ హాస్పిటల్​ ఉంది.  జహీరాబాద్ ఇండస్ట్రియల్​ ఏరియా కార్మికులు ఇక్కడికి రావాలంటే చాలా కష్టాలు పడాల్సి వస్తోంది.  

డిస్పెన్సరీలో  సిబ్బంది కొరత.. 

జహీరాబాద్ ఈఎస్ఐ డిస్పెన్సరీలో సిబ్బంది కొరత ఉంది.  ఒక డాక్టర్ మాత్రమే డ్యూటీ చేస్తున్నారు. ఇంతకుముందు పనిచేసిన ఇద్దరు డాక్టర్లు పైచదువుల కోసం సెలవులో వెళ్లిపోయారు.  ఈ మధ్యనే డిప్యూటేషన్ పై ప్రభుత్వం ఒక డాక్టర్ ను నియమించింది.  పేషెంట్ల తాకిడికి తగ్గట్టుగా డాక్టర్లు  లేకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు  ఎదుర్కొవల్సి వస్తోంది. మిగతా స్టాఫ్​ సేవలు కూడా  అంతంత మాత్రంగానే ఉన్నాయి.

సిబ్బంది కొరత నిజమే..

జహీరాబాద్ ఈఎస్ఐ డిస్పెన్సరీలో  సిబ్బంది కొరత ఉన్న మాట నిజమే.  పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంటోంది. అయినప్పటికీ కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. మందుల కొరత లేదు.  ఇక్కడ అన్ని సౌకర్యాలు లేకపోవడంతో రామచంద్రాపురం ఈఎస్ఐ హాస్పిటల్​కు రిఫర్ చేస్తున్నాం. మరో ఇద్దరు డాక్టర్ల అవసరం ఉంది.  సిబ్బంది కొరత తీర్చగలిగితే  కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

- డాక్టర్ విజయ్ కుమార్