11 రాష్ట్రాల్లోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి : ఎంపీ సురేశ్

11 రాష్ట్రాల్లోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి : ఎంపీ సురేశ్
  •  కేంద్రానికి ఎంపీ సురేశ్ షెట్కార్ రిక్వెస్ట్ 

న్యూఢిల్లీ, వెలుగు: తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం11 రాష్ట్రాల్లో రజక, చాకలి, ధోబి, పరి ట్, వన్నన్ కులాలను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో చేర్చాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కోరారు.  బుధవారం లోక్‌‌‌‌సభలో జీరో అవర్ సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన.. ఈ కులాల వృత్తి అంటరానితనంతో ముడిపడి ఉందన్నారు. పుట్టుక నుంచి చావు వరకు వివిధ సామాజిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

ఈ అంశంపై స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ఎన్నో సార్లు సిఫారసులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌‌‌‌గఢ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదని గుర్తు చేశారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఈ వర్గాలకు న్యాయం చేయాలని సురేశ్ షెట్కార్ కోరారు.