చేతబడి చేస్తున్నాడనే చంపేశాం

చేతబడి చేస్తున్నాడనే చంపేశాం
  • యువకుడి హత్య కేసులో లొంగిపోయిన నిందితులు
  • మీడియాకు వివరాలు తెలిపిన జహీరాబాద్ పోలీసులు 

జహీరాబాద్, వెలుగు: చేతబడి చేస్తున్నాడనే యువకుడిని హత్య చేసినట్టు నిందితులు ఒప్పుకున్నట్టు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసులు తెలిపారు. కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్టు చెప్పారు. సోమవారం జహీరాబాద్ పీఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ సైదా, సీఐ శివలింగం  వివరాలు వెల్లడించారు. జహీరాబాద్ టౌన్ కు చెందిన మహమ్మద్ తాజుద్దీన్(22), చేతబడి చేస్తున్నాడని అనుమానించి అతడిని పలుమార్లు మహమ్మద్ హాసన్ హెచ్చరించాడు. 

అయినా.. తాజుద్దీన్ చేతబడి చేయడం ఆపడం లేదంటూ.. శనివారం నమాజ్ కోసం మసీద్ కు వెళ్తుండగా.. అతడితో మాట్లాడేది ఉందని హాసన్, ముకరం బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లారు. టౌన్ శివారు చెన్నారెడ్డి కాలనీ సమీపంలోని చెరుకు తోటలోకి తాజుద్దీన్ ను తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. కమ్మ కత్తితో రెండు సార్లు మెడపై బలంగా వేటు వేయడంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు. అనంతరం డెడ్ బాడీని నిందితులు హాసన్, ముకరం, అక్బర్ కారులో తీసుకెళ్లి అల్లానా సమీపంలోని పాడుబడ్డ బావిలో పడేసి వెళ్లిపోయారు. 

ఆదివారం ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయి హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. బావిలోంచి డెడ్ బాడీని వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపించారు.  నిందితుల నుంచి కమ్మ కత్తి,  కారు, మూడు బైక్ లు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ సైదా,  సీఐ శివలింగం తెలిపారు. ఎస్ఐ వినయ్ కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు.