కట్టలేని గోడలు

కట్టలేని గోడలు

టెక్నాలజీ అంతగా లేని రోజుల్లో తవ్విన భూగర్భ సొరంగాలు, కట్టిన గోడలు అంతుచిక్కని రహస్యాలు ఇలా ఎన్నో ఉన్నాయిక్కడ. అందుకే వాటిని చూడగానే.. ఎవరు కట్టించారు? ఎలా కట్టారు? ఈ అద్భుతాన్ని ఎలా సృష్టించారు? అసలు దీన్ని మనుషులే కట్టారా?... అనే డౌట్స్‌‌ వస్తుంటాయి. పెరూలోని కుస్కో సిటీకి దగ్గర్లో ఉందిది. దీన్ని ఎలా కట్టారో తెలుసుకునేందుకు ఇప్పటికీ రీసెర్చ్‌‌లు జరుగుతూనే ఉన్నాయి. ఆ అద్భుతం పేరు సక్సేహుమాన్​.

ఈ నిర్మాణంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇక్కడి జిగ్‌‌–జాగ్‌‌ వాల్స్ కొన్ని వందల ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉన్నాయి. వీటిని 15వ శతాబ్దంలో ఇంకా రాజవంశం వాళ్లు కట్టించారు. దీన్ని కట్టేందుకు దాదాపు 30,000 మంది పనిచేశారు. నిర్మాణం పూర్తయ్యేందుకు 70 ఏళ్లకు పైగా పట్టింది. కుస్కో సిటీకి ఉత్తరాన 3,094 హెక్టార్ల విస్తీర్ణంలో అనేక పురావస్తు ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇది. ఈ గోడలకున్న కొన్ని  ప్రత్యేక లక్షణాల వల్ల ఇది గొప్ప స్మారక కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ కట్టడానికి వాడిన రాళ్లను అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిసికాంచ అనే క్వారీ నుంచి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇవి 500 వందల ఏండ్ల పాటు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడ్డాయి. మెషిన్లు లేకుండా అంగుళం కూడా కదపలేనంత పెద్ద రాళ్లతో ఈ గోడలను కట్టారు. ఒక మామూలు కారు బరువు  రెండు టన్నుల కంటే తక్కువగా ఉంటుంది. అయినా.. మామూలు వ్యక్తులు పైకి ఎత్తలేరు. అలాంటిది ఇక్కడున్న రాళ్లలో కొన్నింటి బరువు వంద టన్నుల కంటే ఎక్కువ. అయినా అప్పటివాళ్లు ఎలా ఎత్తగలిగారు? గోడ ఎలా కట్టగలిగారనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీ. కొన్ని రాళ్లు దాదాపు 9 మీటర్ల ఎత్తు ఉన్నాయి. అన్ని రాళ్లను చక్కగా పేర్చారు. అంత వెయిట్‌‌ ఉన్న రాళ్లను హ్యాండ్ టూల్స్‌‌తో అంత ఫర్ఫెక్ట్‌‌గా పేర్చడం సాధ్యం కాదని ఆర్కియాలజిస్ట్‌‌లు చెప్తున్నారు. స్పెయిన్​వాళ్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత వాళ్ల నిర్మాణాలకు అవసరమయ్యే సామాగ్రి కోసం పాత కట్టడాలను పడగొట్టారు. ముఖ్యంగా ఇంకా, కిల్లికేల కాలంలో కట్టిన నిర్మాణాలను ఎక్కువగా కూల్చేశారు. కానీ, వాళ్లు సక్సేహుమాన్ గోడలను మాత్రం కూల్చలేకపోయారు. వాళ్ల దగ్గరున్న టెక్నాలజీతో ఈ రాళ్లను కదపలేకపోయారు. అందుకే స్పానిష్ ప్రజలు ఈ గోడలను అతీంద్రియ శక్తులే కట్టాయని నమ్మడం మొదలుపెట్టారు. ఇప్పటికీ చాలామంది అదే నమ్ముతారు కూడా. 

ప్రపంచంలో ఎక్కడా లేవు

ఈ గోడలకున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. గోడ రాళ్లు ఇక్కడున్న కట్టడాలు ప్రపంచంలో మరెక్కడా లేవు. అంతటి నైపుణ్యంతో కట్టిన రాళ్ల గోడ మరెక్కడా గుర్తించలేదని చాలామంది ఆర్కియాలజిస్ట్‌‌లు చెప్తున్నారు. రాళ్లను ఇంత కచ్చితమైన కొలతలతో కట్‌‌ చేయడం అంత ఈజీ కాదంటారు వాళ్లు. 

విట్రిఫైడ్ స్టోన్‌‌వర్క్ 

విట్రిఫికేషన్ అంటే ఏ పదార్థాలనైనా లిక్విడ్‌‌గా మారే వరకు వేడి చేసి, ఆ లిక్విడ్‌‌ని స్పీడ్‌‌గా చల్లబరుస్తారు. విట్రిఫైడ్ స్టోన్‌‌వర్క్ అంటే రాళ్లను సూపర్‌‌హీట్ చేయడం. సాధారణంగా అగ్ని పర్వతం నుంచి వచ్చే లావా ద్వారా రాళ్లు విపరీతంగా వేడుక్కుతాయి. అలా లావాతో సూపర్‌‌‌‌హీట్‌‌ చేసి ఈ గోడలు కట్టారని చాలామంది వాదిస్తున్నారు. కానీ.. అప్పటివాళ్ల దగ్గర అంత టెక్నాలజీ లేదని మరికొందరు అంటారు. ఇలాంటి విట్రిఫైడ్‌‌ స్టోన్‌‌వర్క్‌‌ ప్రపంచంలోని చాలా దేశాల్లో కనిపిస్తోంది. విట్రిఫైడ్ స్టోన్‌‌వర్క్‌‌తో కట్టినవి స్కాట్లాండ్​లో చాలానే కనిపిస్తాయి. స్కాట్లాండ్‌‌లో క్రీ.పూ.700 నుండి 300 మధ్య కాలంలో కొన్ని కోటలను ఈ పద్ధతిలోనే కట్టారు. అందుకోసం రాళ్లను సుమారు 1,100 డిగ్రీల టెంపరేచర్‌‌కు పైగా వేడి చేశారు. 

ఏలియన్స్‌‌

ఈ కోటను కట్టిన ఇంకా వంశస్తులకు గ్రహాంతరవాసులతో సంబంధాలు ఉండేవని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే ఈ కోటతోపాటు వాళ్లు అనేక అద్భుత నిర్మాణాలు చేశారు. అంత టెక్నాలజీ అప్పట్లో ఎక్కడా లేదు. కాబట్టి అందుకు కావాల్సిన టెక్నాలజీని గ్రహాంతరవాసులే ఇంకా ప్రజలకు ఇచ్చారని చెప్తుంటారు. ముఖ్యంగా సక్సేహుమాన్‌‌ను క్రియేట్‌‌ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ వాళ్లే అందించారని నమ్ముతున్నారు.  

న్యూక్లియర్‌‌‌‌ పవర్‌‌‌‌

పెరూలోని రాజ్యాల మధ్య అప్పట్లోనే అణు యుద్ధాలు జరిగేవని, ఆ న్యూక్లియర్‌‌‌‌ టెక్నాలజీతోనే రాళ్లను కరిగించి ఈ కోటను కట్టారని కొందరు వాదిస్తున్నారు. కానీ.. ఈ సిద్ధాంతానికి సంబంధించి ఏ ఒక్క ఆధారం కూడా అక్కడ కనిపించలేదు. పైగా ఈ సైట్ల దగ్గర రేడియేషన్ ఆనవాళ్లు లేవు. 

లెన్స్‌‌లు వాడారా? 

రాయిని కరిగించడానికి కావాల్సిన వేడిని సూర్యకిరణాలతోనే నేచురల్‌‌గా క్రియేట్‌‌ చేశారని మరికొందరు చెప్తున్నారు. అంటే.. కొన్ని రకాల అద్దాలు, లెన్స్‌‌లు వాడి సూర్యరశ్మి నుంచి వచ్చే వేడిని కొన్ని వందల రెట్లు పెంచి రాళ్లను కరిగించారనే సిద్ధాంతం కూడా చెప్తున్నారు. ఇది వినడానికి ఈజీగా ఉన్నా సాధ్యమయ్యే పని కాదని, అలాంటి వ్యవస్థ వాళ్లకు తెలిస్తే దాని గురించి ఎక్కడో ఒకచోట రాసి ఉండేవాళ్లని కొందరు అంటున్నారు. 

టెంప్లెట్‌ మేకింగ్

ఈ గోడల నిర్మాణంపై అనేక సిద్ధాంతాలు పుట్టుకొచ్చినా ఎక్కువమంది మాత్రం ‘జాన్ మెక్‌‌కాలీ’ చెప్పిన సిద్ధాంతాన్నే నమ్ముతున్నారు. ఆయన రిటైర్డ్ ఆర్కిటెక్ట్. పైగా 40 సంవత్సరాలపాటు పాత నిర్మాణ పద్ధతులపై రీసెర్చ్‌‌ చేశాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. ఇంకా ప్రజలు ఈ నిర్మాణంలో మెగాలిథిక్ రాళ్లను ఇంటర్‌‌ లాకింగ్ చేశారు. అందుకోసం వాళ్లు ‘‘టెంప్లెట్-మేకింగ్’’ అనే సిస్టమ్‌‌ని వాడుకున్నారు. అంటే పెద్ద పెద్ద రాళ్లను అక్కడికి తీసుకెళ్లి, వాటిని అక్కడే చెక్కి పాలిష్ చేశారు. ఒకదానికొకటి సరిగ్గా సరిపోయేందుకు టెంప్లెట్(నమూనా)ను తయారుచేసుకున్నారు. అంటే రాయి పెట్టాలనుకునే స్థలాన్ని జాగ్రత్తగా కొలుస్తారు. ఆ కొలతలతో చెక్క టెంప్లెట్‌‌ను తయారు చేస్తారు. ఈ టెంప్లెట్‌‌ ఆకారానికి సరిపోయేలా రాయిని చెక్కుతారు. ఆ తర్వాత పాలిష్‌‌ చేసి అమర్చుతారు. అయితే.. ఈ పద్ధతిలో నిర్మిస్తే ఫర్ఫెక్ట్‌‌గా రాదు. కానీ.. ఇంకా ప్రజల ఆర్ట్ వర్క్ వల్ల అది సాధ్యమైంది. ఎందుకంటే వాళ్లకు మ్యాథ్స్‌‌, సైన్స్‌‌లో చాలా నాలెడ్జ్‌‌ ఉంది. కాబట్టి రాయిని చెక్కడంలో ఫర్ఫెక్షన్‌‌ ఉండేది. కానీ.. రాయికి రాయికి మధ్య కనీసం సన్నని కాగితం పట్టేంత గ్యాప్‌‌ కూడా లేకుండా చెక్కడం సాధ్యం కాదు. కాబట్టి ఈ రాళ్లను కరిగించి కట్టి ఉంటారని కొందరు వాదిస్తున్నారు.  

సొరంగాలు

ఈ కోటలోని మరో మిస్టరీ భూగర్భ సొరంగాలు. వీటిని ‘చింకనాస్’ అని పిలుస్తారు. ఈ సొరంగాలను కూడా ఇంకా ప్రజలే నిర్మించారు. అయితే.. వీటిని ఎందుకు ఏర్పాటు చేశారు? ఇవి ఎక్కడివరకు వెళ్తాయనేది? ఇప్పటికీ కనుక్కోలేకపోయారు ఆర్కియాలజిస్ట్‌‌లు. అయితే..  కొందరు మాత్రం పెరూలోని ఇతర సిటీలకు ఈ సొరంగాల ద్వారా వెళ్లొచ్చని నమ్ముతున్నారు. ఇంకొందరేమో, రాజులు దాచుకున్న సంపద ఉన్న గదులకు ఆ సొరంగాలు తీసుకెళ్తాయని నమ్ముతారు. అందుకే చాలామంది వాటి లోపల ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో లోపలికి వెళ్లారు. కొందరు మధ్యలో నుంచే వెనక్కి వచ్చారు. మరికొందరు లోపలివరకు వెళ్లి, తిరిగి రాలేదు. దాంతో 1920లో చాలా సొరంగాలను మూసేశారు. 

రాళ్లను కట్‌‌ చేశారా? 

అన్ని కోటలను కట్టినట్టే ఈ కోటను కట్టారని కొందరు ఆర్కియాలజిస్ట్‌‌లు చెప్తున్నారు. అంటే రాళ్లను గోడ కట్టేందుకు అనుకూలంగా మలిచి కట్టారు. ఆ తర్వాత దగ్గర్లోని అడవిలో మంటలు చెలరేగడంతో ఆ మంటలు కోటకు వ్యాపించి రాళ్లు కరిగి ఇలా అతుక్కుపోయాయని చెప్తున్నారు. ఈ విషయాన్ని నిరూపించడానికి చాలామంది గోడలపై రీసెర్చ్‌‌లు చేశారు. కానీ.. ఎవరూ నిరూపించలేకపోయారు. 

ప్యూమా తల

‘ప్యూమా’ను ఇంకా రాజవంశానికి ప్రతీకగా చెప్తుంటారు. అందుకే కుస్కో సిటీని ప్యూమా ఆకారంలో కట్టారట. నగరంలోని మెయిన్ ప్లాజాను ప్యూమా బొడ్డుగా చెప్తుంటారు. తుల్లుమాయో నది దాని వెన్నెముక. సక్సేహుమాన్ కొండ దాని తలగా ఉంది. అంతేకాదు.. ఇంకా ప్రజల కల్చర్‌‌‌‌కు ఇండియన్‌‌ కల్చర్‌‌‌‌తో కొన్ని పోలికలు ఉన్నాయి. వాళ్లు కూడా సూర్యుడు, చంద్రుడితో పాటు వాయుదేవుడిని కొలుస్తారు. గ్రహాలను నమ్ముతారు. గ్రహాల కదలికలను బట్టి రోజులను లెక్కిస్తారు.  
దీనితోపాటు ప్రంపంచంలో అద్భుతమైన నిర్మాణాలు చాలానే ఉన్నాయి. అంటే మన ముందు తరాల వాళ్లు టెక్నాలజీ, నాలెడ్జ్‌‌లో మనకంటే ఏమాత్రం తీసిపోరు. మనం ఇప్పటికీ చేయలేని అద్భుతాలను వాళ్లు ఎప్పుడో క్రియేట్‌‌ చేశారు. కంప్యూటర్లు, మైక్రోచిప్‌‌లు లేని టైంలోనే ఎన్నో విజయాలు సాధించారు. 
::: కరుణాకర్​ మానెగాళ్ల