రాత్రంతా ఫేస్‌బుక్, వాట్సాప్ బంద్.. రూ.52 వేల కోట్లు హాంఫట్

రాత్రంతా ఫేస్‌బుక్, వాట్సాప్ బంద్.. రూ.52 వేల కోట్లు హాంఫట్

కాలిఫోర్నియా: ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌‌బుక్ సేవలకు అంతరాయం కలిగింది. భారత్‌‌లో దాదాపు 7 గంటల పాటు.. ఫేస్‌‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా‌‌గ్రామ్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఫేస్‌బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద కొన్ని గంటల వ్యవధిలోనే 7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.52 వేల కోట్లు) తరిగిపోయింది. దీంతో ఆయన బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ జాబితాలో మూడు నుంచి ఐదో స్థానానికి పడిపోయారు. ఫేస్‌బుక్‌లో సమస్యలు తలెత్తాయన్న న్యూస్ బయటకు రాగానే ఆ సంస్థ షేర్లు 5 శాతం మేర పడిపోయాయి. గత నెల నుంచి ఇప్పటి వరకు ఫేస్‌బుక్ షేర్ల విలువలో 15 శాతం తగ్గుదల నమోదైంది. అలాగే సోమవారం చాలా కంపెనీలు ఫేస్‌బుక్‌ నుంచి తమ యాడ్స్‌ తొలగించడం గమనార్హం. 

ఇండియానే అతిపెద్ద మార్కెట్

వాట్సప్ చూడకపోతే ఏదో కోల్పోయినట్లు అనేక మంది అల్లాడిపోతారు. ఫేస్‌‌బుక్‌‌లోని పోస్టులు, లైక్‌‌ల గురించి తెలుసుకునేందుకు తపనపడుతుంటారు. ఫొటోల్ని పంచుకోవడానికి ఇన్‌‌స్టాగ్రామ్ వైపు చూస్తారు. అంతగా అలవాటైపోయిన ఈ సామాజిక మాధ్యమాలు.. 7 గంటలకు పైగా పనిచేయకపోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా భారత్‌లో యూజర్లు దీని మీద ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫేస్‌‌బుక్‌‌కు ఇండియాలో 41 కోట్ల యూజర్లున్నారు. వాట్సాప్ కు 53 కోట్ల యూజర్లున్నారు. అలాగే ఇన్‌‌స్టాగ్రామ్‌లో 21 కోట్ల మంది భారతీయులకు అకౌంట్స్ ఉన్నాయి. ఈ మూడు ప్లాట్‌‌ఫామ్స్‌‌కు ప్రపంచంలో భారతే అతిపెద్ద మార్కెట్. సోమవారం ఈ యాప్స్ సేవలు హఠాత్తుగా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రస్తుతం ఈ యాప్స్ పనిచేస్తున్నా.. సేవలు నిలిచిపోవడానికి కారణాలు తెలియరాలేదు. 

మరిన్ని వార్తల కోసం..

ఈమె నోరు విప్పడం వల్లే ఫేస్‌బుక్, వాట్సాప్‌ ఆగిపోయాయా?

ఆన్‌లైన్‌ గేమ్స్​ ఆడొద్దన్నందుకు​ స్టూడెంట్​ సూసైడ్

సోషల్​ మీడియాలో ఇలా ఉండాలె

చీరలు నచ్చకుంటే వెళ్లిపోండి.. మహిళలపై ఎంపీపీ ఆగ్రహం