ఖమ్మం – సూర్యాపేట హైవేపై ఆగని యాక్సిడెంట్లు

ఖమ్మం – సూర్యాపేట హైవేపై ఆగని యాక్సిడెంట్లు
  •     హైవే నిర్మాణంలో టెక్నికల్ లోపాలే కారణమనే విమర్శలు
  •     సర్వీస్​రోడ్లు లేక హైవే ఎక్కుతున్న బర్రెలు, ఆవులు
  •     స్పీడ్​ కంట్రోల్​ కాక వాటిని ఢీకొడుతున్న వాహనదారులు
  •      ఊళ్లలో గ్రిల్స్, డివైడర్లు, సర్వీస్​రోడ్లు నిర్మించాలని కోరుతున్న జనం

ఖమ్మం, వెలుగు : ఖమ్మం నుంచి సూర్యాపేటకు వెళ్లే నేషనల్​హైవే 365 బీబీపై తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా పొన్నెకల్లు నుంచి సూర్యాపేట జిల్లా టేకుమట్ల వరకు 59 కిలోమీటర్లు విస్తరించిన ఉన్న రోడ్డుపై డైలీ ఎక్కడో ఒకచోట యాక్సిడెంట్​జరుగుతూనే ఉంది. గతేడాది అక్టోబర్ నుంచి దీనిపై రాకపోకలకు అనుమతివ్వగా, పోలీస్​రికార్డుల ప్రకారం ఇప్పటివరకు రెండు జిల్లాల పరిధిలో 20కి పైగా యాక్సిడెంట్లు అయ్యాయి. వీటిలో15 మంది చనిపోయారు.10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక పోలీసుల రికార్డులకు ఎక్కని యాక్సిడెంట్లు మరో 20 వరకు ఉంటాయని తెలుస్తోంది. రాత్రి వేళల్లో బర్రెలు, ఆవులు హైవే ఎక్కడమే ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రోడ్డు యాక్సిడెంట్లలో 50కు పైగా బర్రెలు చనిపోయాయి. కొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. వెహికల్స్ ధ్వంసమయ్యాయి. రూ.1,560 కోట్లతో హైబ్రిడ్​యాన్యుటీ మోడ్​లో నిర్మించిన ఈ హైవేలో టెక్నికల్​లోపాలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎలాంటి అడ్డూ లేకపోవడంతో.. 

నేషనల్​హైవే 365బీబీ నిర్మాణ సమయంలో మండల కేంద్రాల్లో మాత్రమే బైపాస్​రోడ్డు నిర్మించి, ఊళ్లలో అంతకు ముందున్న ఖమ్మం- – సూర్యాపేట రోడ్డును విస్తరించి వదిలేశారు. టోల్ ఫీజులు వసూలు చేసేందుకు సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెం దగ్గర, పాత రోడ్డును కలిపే ప్రాంతంలో టోల్ ప్లాజాను నిర్మించారు. అక్కడి నుంచి సూర్యాపేట వైపు వెళ్లే రహదారిలో మోతె మినహా మామిళ్లగూడెం, హుస్సేనాబాద్, నామవరం క్రాస్ రోడ్, బండమీద చందుపట్ల వరకు అంతకు ముందున్న రోడ్డునే విస్తరించి హైవేగా మార్చారు. దీంతో పల్లెటూళ్లలో బర్రెలు, ఆవులు, గొర్రెలు, మేకలు డైలీ మేతకు వెళ్తూ హైవే ఎక్కుతున్నాయి. 

వేరే మార్గం లేక రైతులు, పశువుల కాపర్లు హైవేనే ఉపయోగిస్తున్నారు. మిగిలిన ఊళ్లలో అండర్​పాస్​లు, సర్వీస్​రోడ్లు దూరంగా ఉన్నచోట రైతులు తమ పొలాలకు, వ్యవసాయ భూములకు వెళ్లేందుకు హైవే ఎక్కుతున్నారు. ఎత్తైన డివైడర్లు లేకపోవడంతో, హైవేకు రెండు వైపులా ఎలాంటి గ్రిల్స్​లేకపోవడంతో ఎవరు ఇష్టమొచ్చినట్లు వాళ్లు హైవేను దాటుతున్నారు. గడిచిన నాలుగు నెలల్లో ఎండలు ఎక్కువగా ఉండడంతో గడ్డి, పంటలు లేక రైతులు బర్రెలు, ఆవులను దగ్గరుండి మేపకుండా, రోడ్డుపైకి వదిలేస్తున్నారు. 

ఉదయం, సాయంత్రం వేళల్లో అవి తిరిగొస్తూ హైవేపై వెహికల్స్ కు అడ్డుపడుతున్నాయి. స్పీడ్​కంట్రోల్ కాక చాలా మంది వాహనదారులు వాటిని ఢీకొడుతున్నారు. బర్రెలు నల్లగా ఉండటంతో రాత్రిళ్లు దగ్గరకు వచ్చే వరకు వాహనదారులు వాటిని గుర్తించలేకపోతున్నారు. కనీసం గ్రామాలకు సమీపంలో హైవేకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, మధ్యలో డివైడర్లు, అవసరమైన ప్రతిచోట సర్వీస్​రోడ్లు నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు. 

“సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెం రైతు వేదిక సమీపంలో మే నెల చివరి వారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వేగంగా వస్తున్న కారు రైతు వేదిక సమీపంలో హైవేపైకి వచ్చిన బర్రెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 బర్రెలు చనిపోగా, మరో బర్రె తీవ్రంగా గాయపడింది. కారు పల్టీ కొట్టుకుంటూ రోడ్డు పక్కకు వెళ్లి ఆగింది. సీటు బెల్టు పెట్టుకున్న కారులోని ఖమ్మంకు చెందిన రియల్టర్, అతని కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి.’’

రూ.80వేలు నష్టపోయా

రెండు నెలల కింద బర్లను తిండికి వదిలిపెట్టాం. రాత్రి చీకటి అయినా రాకపోవడంతో అన్నిచోట్ల తిరిగి చూశాం. రాత్రిపూట హైవేపై లారీ ఢీకొట్టడంతో రెండు బర్రెలు  చనిపోయాయి. రూ.80 వేల వరకు నష్టపోయా.

– గొల్లపూడి శ్రీను, నాయకన్ గూడెం

సర్వీస్​రోడ్డు ఉంటే బాగుంటుంది

రాత్రి పూట బర్రెలు హైవేపైకి వస్తున్నాయి. వెహికల్స్​వాటిని ఢీకొడుతుండడంతో పశువులతోపాటు వాహనదారులు చనిపోతున్నారు. మూగ జీవాలు హైవే ఎక్కకుండా గ్రిల్స్​ఏర్పాటు చేసి సర్వీస్ రోడ్డు నిర్మిస్తే బాగుంటుంది. మూడు నెలల్లో మా ఊర్లోనే 20 బర్రెలు చనిపోయాయి. 

– కాంచాని సైదులు, నాయకన్ గూడెం