‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం

‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం
  • నెలరోజులు వేచి చూసిన తర్వాత ఈ నిర్ణయం: మంచు విష్ణు
  • మా' భవనంపై మరో వారంలో  నిర్ణయం ప్రకటిస్తా - మంచు విష్ణు

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పోటీ చేసి, గెలుపొందిన 11మంది సభ్యులు రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. అయితే వారు సభ్యులుగా కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'మా' సభ్యులకు ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ ‘రాజీనామాలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరాను. కానీ వారు అందుకు సిద్ధంగా లేకపోవడంతో నెల రోజుల పాటు వెయిట్ చేసి, రాజీనామాలను అంగీకరించడం జరిగింది. మా అసోసియేషన్ వర్క్స్ కోసం వారి స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నాను. అయితే వారు 'మా' సభ్యులుగా కొనసాగుతారు. నాగబాబు, ప్రకాష్ రాజు కూడా 'మా' సభ్యులుగా కొనసాగుతారు’ అని వెల్లడించారు.
ఉచిత వైద్య శిబిరం
''మెడికవర్ హాస్పటల్స్, మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మొత్తం 914 మంది సభ్యులకు వివిధ రకాల మాస్టర్ హెల్త్ చెకప్ లు చేశారు. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేసిన దగ్గర్నుంచి మాదాల రవి అన్నదగ్గర ఉండి అన్నీ చూసుకున్నారని మంచు విష్ణు తెలిపారు. మెడికవర్ హాస్పటల్ వారు ముందుకు వచ్చి ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తున్నారు. అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండో వారంలో ఈ హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేస్తాము. మెడికవర్ వాళ్ళు సినిమా జర్నలిస్ట్ లకు కూడా ఉచితంగా హెల్త్ చెకప్ లు చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను'' అని  మంచు విష్ణు వివరించారు.
మా భవనంపై వారం రోజుల్లో ప్రకటన
మా బిల్డింగ్ కోసం చర్చలు జరుగుతున్నాయి. 'మా' కమిటీ మీటింగ్ జరిగింది. వారం రోజుల్లో మా బిల్డింగ్ పై ప్రకటన చేస్తామని మంచు విష్ణు వెల్లడించారు. తాను ఎన్నికైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సొంత భవన నిర్మాణం చేపడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. 
'మా' జనరల్ సెక్రటరీ రఘుబాబు మాట్లాడుతూ హెల్త్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. దానిని ఫస్ట్ ప్రయార్టీగా తీసుకుని, సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు 'మా' ప్రెసిడెంట్ విష్ణు. ముందుముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు విష్ణు ఆధ్వర్యంలో సక్సెస్ ఫుల్ గా జరుగుతాయ అన్నారు.  
'మా' ట్రెజరర్ శివబాలాజీ మాట్లాడుతూ హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ. మా సభ్యులు అందరూ దీనిని ఉపయోగించుకోవాలి. 'మా' సభ్యుల హెల్త్ కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో 'మా' ప్రెసిడెంట్ విష్ణు సక్సెస్ అయ్యారు.
'మా' వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ మా సభ్యుల ఆరోగ్యం ముఖ్యం. సామాజిక స్పృహతో పనిచేస్తున్న మెడికవర్ హాస్పటల్ కి కృతజ్ఞతలు. చాలా హాస్పటల్స్ తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఉచితంగా మాస్టర్ హెల్త్ చెకప్ చేయడానికి  మెడికవర్ హాస్పటల్ ముందుకు వచ్చింది. అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. 
మెడికవర్ హాస్పటల్ నుంచి శిబిరం నిర్వహించిన డాక్టర్ అనిల్ మాట్లాడుతూ రొటీన్ గా చేసే హెల్త్ చెకప్ ఇవి. ఈ హెల్త్ చెకప్ లు మా సభ్యులకు చేయటం చాలా సంతోషంగా ఉంది. అన్ని రకాల వ్యాధులకు టెస్టులు చేస్తున్నామన్నారు.