సహచరులు లైంగికంగా వేధిస్తున్నరు.. సీజేఐకి మహిళా జడ్జి లేఖ

సహచరులు లైంగికంగా వేధిస్తున్నరు.. సీజేఐకి మహిళా జడ్జి లేఖ

న్యూఢిల్లీ: ప్రజలందరికీ న్యాయం చేసే న్యాయమూర్తికే న్యాయం దక్కలేదు. తనను లైంగికంగా వేధించారని ఓ మహిళా జడ్జి.. హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చివరకు తాను చనిపోతానని, అందుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు బాధితురాలు బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడా లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. యూపీలోని బాందా జిల్లాలో సివిల్ జడ్జిగా పని చేస్తున్న మహిళ.. అక్కడి జిల్లా జడ్జి, ఆయన అనుచరులు తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. ‘‘నన్ను లైంగికంగా వేధించారు. నన్నొక పురుగులాగా చూశారు. వేధింపులపై ఈ ఏడాది జులైలో హైకోర్టు ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీకి ఫిర్యాదు చేశాను. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ కేసులో సాక్షులుగా జిల్లా జడ్జి కింద పనిచేస్తున్న ఉద్యోగులే ఉన్నారు. వాళ్లు తమ బాస్ కు వ్యతిరేకంగా సాక్ష్యం ఎలా చెప్పగలరు. అందుకే విచారణ పారదర్శకంగా జరగాలంటే జిల్లా జడ్జిని బదిలీ చేయాలని నేను కోరాను. ఇందుకోసం సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశాను. కానీ నా పిటిషన్ ను కేవలం ఎనిమిది సెకండ్లలో సుప్రీంకోర్టు కొట్టివేసింది” అని లేఖలో మహిళా జడ్జి వాపోయారు. ‘‘కేసు దర్యాప్తు పూర్తయ్యేంత వరకు జిల్లా జడ్జిని మరో చోటుకు బదిలీ చేయాలని నేను ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. గత ఏడాదిన్నరగా నేనో జీవచ్ఛవంలా బతుకుతున్నాను. ఇక నాకు బతకాలని లేదు. చనిపోవడానికి అనుమతించండి” అని ఆవేదన వ్యక్తం చేశారు.

రిపోర్టు ఇవ్వాలని సీజే ఆదేశం..

మహిళా జడ్జి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందించారు. ఈ కేసుపై వెంటనే రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. సీజేఐ ఆదేశాలతో కేసు పురోగతిపై రిపోర్టు ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్ లేఖ రాశారు.