మా మేనిఫెస్టోకు సూచనలివ్వండి : యూత్​కు ప్రధాని మోదీ పిలుపు

మా మేనిఫెస్టోకు సూచనలివ్వండి : యూత్​కు ప్రధాని మోదీ పిలుపు
  • నమో యాప్​లో సలహాలు చెప్పాలని విజ్ఞప్తి
  • కుటుంబ పార్టీలను ఓడించాలని యువ ఓటర్లకు సూచన
  • తొలిసారి ఓటు వేసే వాళ్లు.. బీజేపీకి మద్దతివ్వాలన్న మోదీ

న్యూఢిల్లీ/బులంద్‌‌‌‌షహర్/రెవారి :  వచ్చే లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో బలమైన మెజారిటీతో స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని యువ ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కుటుంబ పార్టీలను ఓడించాలని కోరారు. దేశం దశ దిశను యూత్ ఓట్లే డిసైడ్ చేస్తాయని అన్నారు. గురువారం నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా బీజేపీ యూత్ వింగ్ నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్‌‌‌‌గా ప్రధాని మాట్లాడుతూ.. పదేండ్లకు ముందు నెలకొన్న చీకట్ల నుంచి దేశాన్ని బయటికి తీసుకొచ్చామని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై నమో యాప్ ద్వారా తమకు సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బాగున్న, అమలు చేయదగిన ఆలోచనలను మేనిఫెస్టోలో పెడుతామని అన్నారు.

పెద్ద నిర్ణయాలను తీసుకున్నం

‘‘ఎల్లప్పుడూ యువతే నా ప్రాధాన్యం. మీ కలలను నెరవేర్చడమే నా లక్ష్యం. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఎన్నో రంగాల్లో చేసిన సంస్కరణలు, మౌలిక సదుపాయాల్లో ఖర్చు చేసిన భారీ వ్యయం.. యువతకు అపరిమితమైన అవకాశాలను సృష్టించాయి” అని ప్రధాని అన్నారు. తొలి సారి ఓటు వేసే వాళ్లు.. బీజేపీ అజెండాకు మద్దతు ఇవ్వాలని కోరారు. ‘‘అవినీతికి, బంధుప్రీతికి యువత వ్యతిరేకంగా ఉండాలి. యూత్ ముందుకు వెళ్లేందుకు కుటుంబ పార్టీలు ఎన్నడూ అనుమతించవు. ఈ పార్టీల నేతల ఆలోచనా విధానం యువతకు వ్యతిరేకం. మీ ఓట్ల బలంతో ఈ కుటుంబ పార్టీలను ఓడించాలి’’ అని కోరారు. దశాబ్దాలుగా పెండింగ్‌‌‌‌లో ఉన్న సమస్యలను పదేండ్లలో పరిష్కరించామని, పెద్ద నిర్ణయాలను తీసుకున్నామని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్ రద్దు, జీఎస్టీ, మహిళా రిజర్వేషన్లు, రామ మందరిం వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘మీరు వేసే ఓటు, దేశ అభివృద్ధి దిశ.. రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మీ ఒక్క ఓటు భారతదేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తుంది. స్థిరమైన ప్రభుత్వాన్ని తెస్తుంది. సంస్కరణలను మరింత వేగవంతం చేస్తుంది’ అని అన్నారు.

నిజాయితీగా సేవ చేస్తున్నం

బులంద్‌‌‌‌షహర్‌‌‌‌లో రూ.19,100 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘మోదీ నిజాయితీగా సేవ చేస్తున్నాడు. అందుకే మా ప్రభుత్వ హయాంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటికి వచ్చారు. మీరు నా కుటుంబం. మీ కలలు నెరవేర్చడమే నా లక్ష్యం” అని అన్నారు.

‘మోదీని ఎన్నుకుందాం’.. బీజేపీ ఎన్నికల నినాదం

వచ్చే లోక్‌‌‌‌సభ ఎన్నికలకు ‘మోదీని ఎన్నుకుందాం’ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. గురువారం ఈ మేరకు ఈ క్యాంపెయిన్‌‌‌‌ను మోదీ, పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ప్రారంభించారు. ‘‘సప్నే నహీ హకీకత్ బన్‌‌‌‌తే హై, తబీ తో సబ్ మోదీ కో చున్‌‌‌‌తే హై’’ అంటూ థీమ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.