- ఒకటి, రెండు రోజుల్లో రైతుల అకౌంట్లలో జమ
- రూ.575 కోట్లతో తుర్కపల్లి మండలంలో రిజర్వాయర్
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో నిర్మిస్తున్న గంధమల్ల రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం మంజూరైంది. మొదటి విడత కింద రూ.25 కోట్లను రిలీజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిర్వాసిత రైతుల అకౌంట్లలో ఒకటి, రెండు రోజుల్లో డబ్బులను జమ చేసేందుకు ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
1.4 టీఎంసీల కెపాసిటీతో గంధమల్ల నిర్మాణం
ఆలేరు నియోజకవర్గానికి సాగు నీరందించేందుకు రూ.575 కోట్లతో 1.4 టీఎంసీల కెపాసిటీతో తుర్కపల్లి మండలంలో గంధమల్ల రిజర్వాయర్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 2,500 మంది రైతుల వద్ద నుంచి 994.37 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. మూడు కిలోమీటర్ల విస్తీర్ణంతో నిర్మించే బండ్ కోసం 112 ఎకరాలు అవసరం కాగా.. మిగతా భూమి రిజర్వాయర్ కారణంగా ముంపునకు గురవుతోంది.
2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరానికి గరిష్టంగా రూ.11.75 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంతరావు పలుమార్లు రైతులతో చర్చించారు. ఎకరానికి రూ.24.50 లక్షలు ఇస్తామని చెప్పడంతో రైతులు అంగీకరించారు. ఈ పరిహారంతో పాటు భూముల్లోని నిర్మాణాలకు అదనంగా పరిహారం అందించనున్నారు.
బండ్ నిర్మాణ ప్రాంతంలో సర్వే పూర్తి
గంధమల్ల వద్ద బండ్ నిర్మాణ ప్రాంతంలో ఇప్పటికే సర్వే పూర్తి చేశారు. ఇక్కడి భూముల్లో ఉన్న చెట్లు, బావులు, బోర్లను గుర్తించారు. రైతులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌తో పాటు ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలను సేకరించారు.
కరువు సమస్యకు శాశ్వత పరిష్కారం : బీర్ల అయిలయ్య, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే
ఆలేరు నియోజకవర్గానికి సాగు నీరందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. గంధమల్ల రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు మొదటి విడత పరిహారం అందిస్తున్నామన్నారు. ఈ రిజర్వాయర్పూర్తి అయితే ఆలేరు కరువు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
