- వార్డులు, క్యాంటీన్లలో అవే దుస్తులతో తిరిగితే కుదరదు
- సర్క్యులర్ జారీ చేసిన హాస్పిటల్ సూపరింటెండెంట్
హైదరాబాద్, వెలుగు: గాంధీ హాస్పిటల్లో డాక్టర్లు, సిబ్బంది ధరించే స్క్రబ్స్ వినియోగంపై హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆంక్షలు విధించారు. స్క్రబ్స్‌ను కేవలం ఆపరేషన్ థియేటర్లు (ఓటీ), ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో(ఐసీయూ) మాత్రమే వినియోగించాలంటూ సర్క్యులర్ జారీ చేశారు.
పీజీ డాక్టర్లు, హౌస్ సర్జన్లు స్క్రబ్స్ ధరించి ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లలో విధులు నిర్వర్తించిన అనంతరం, అదే దుస్తులతో హాస్పిటల్ వార్డులు, ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నారని వివిధ విభాగాల హెచ్వోడీలు సూపరింటెండెంట్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన సూపరింటెండెంట్, ఇన్ఫెక్షన్ల నియంత్రణ నిబంధనల దృష్ట్యా.. రెసిడెంట్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు, ఇతర హెల్త్‌కేర్ సిబ్బంది ఎవరూ కూడా ఓటీ/ఐసీయూ స్క్రబ్స్ ధరించి జనరల్ వార్డులు, ఓపీడీలు, కారిడార్లు, హాస్పిటల్ కార్యాలయాలు, క్యాంటీన్లు సహా దవాఖాన ప్రాంగణంలోని సాధారణ ప్రాంతాల్లో తిరగొద్దని ఆదేశించారు.
