నేడు( నవంబర్16)  రాష్ట్రవ్యాప్తంగా ‘పిల్లల ప్రజావాణి’..33 కలెక్టరేట్లలో ప్రత్యేక ఏర్పాట్లు

నేడు( నవంబర్16)  రాష్ట్రవ్యాప్తంగా ‘పిల్లల ప్రజావాణి’..33 కలెక్టరేట్లలో ప్రత్యేక ఏర్పాట్లు
  • విద్య, వైద్యం, రక్షణ, సంక్షేమ సమస్యలపై కలెక్టర్లకు ఫిర్యాదు చేసే అవకాశం

హైదరాబాద్, వెలుగు: పిల్లలు తమ సమస్యలను నేరుగా జిల్లా కలెక్టర్లకు చెప్పుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా నేడు ‘పిల్లల ప్రజావాణి’ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 33 జిల్లాల కలెక్టరేట్లలో ఈ కార్యక్రమం జరగనుంది. నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహిస్తున్న బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందుకోసం కలెక్టరేట్లలో ప్రత్యేక డెస్క్‌‌‌‌లు, హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు పర్యవేక్షించనున్నారు.

అన్ని సమస్యలపై ఫిర్యాదులు.. 

స్కూల్ అడ్మిషన్లు, మౌలిక వసతులు, టీచర్ల కొరత, రవాణా సౌకర్యం, స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌లు, కుల, ఆదాయ సర్టిఫికెట్ల జారీలో జాప్యంపై పిల్లలు ఫిర్యాదు చేయవచ్చు. హాస్పిటళ్లలో వైద్యం, పోషకాహార లోపం, దివ్యాంగులకు అందాల్సిన పథకాలు, ఉపకరణాలపై వినతులు ఇవ్వొచ్చు. బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలు, బాలల భిక్షాటన, వేధింపులు, హింస వంటి సమస్యలను కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లవచ్చు. పిల్లలను స్కూళ్ల నుంచి బలవంతంగా తీసుకురాకుండా, సమస్యలు ఉన్నవారు స్వచ్ఛందంగా వచ్చి ఫిర్యాదు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. కలెక్టరేట్లకు వెళ్లలేని చిన్నారులు తల్లిదండ్రులు, సంరక్షకులు లేదా టీచర్ల సాయంతో వినతులు ఇవ్వవచ్చు.