నైపుణ్యాధారిత విద్యకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మార్కెట్, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యను ఉపాధితో అనుసంధానించే చర్యలను వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ – గతంలో ఐటీఐలు)ను కొత్తగా ఏర్పాటైన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తేనున్నట్లు తాజా బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ నిర్ణయంతో దశాబ్దాలుగా సాంకేతిక విద్య, ఉపాధి–శిక్షణ శాఖల పరిధిలో ఉన్న ఈ సంస్థలు ఒకే గొడుకు కిందకు రానున్నాయి. తద్వారా వృత్తివిద్యకు నవ చైతన్యం అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. అయితే, ఈ ప్రయాణంలో క్షేత్ర స్థాయిలో ఉన్న సవాళ్లను అధిగమించగలిగితే తెలంగాణ నైపుణ్య విద్యలో దేశానికే ఒక దిక్సూచిగా నిలవగలదు.
యువతకు మార్కెట్‌కు అవసరమైన నైపు ణ్యాలను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 2024 ఆగస్టు 1న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. పరిశ్రమల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ విశ్వ విద్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాన్సలర్‌గా ఉండగా, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా నేతృత్వంలోని బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని క్యాంపన్‌లో స్వల్పకాలిక కోర్సులతో ప్రారంభమైనా.. భవిష్యత్తులో డిప్లొమా నుంచి డిగ్రీ, పీజీ వరకు విస్తరించే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో శాశ్వత ప్రాంగణం నిర్మాణమవుతోంది.
డిప్లొమా, ఏటీసీలకు విశ్వవిద్యాలయ హోదా
వివిధ శాఖల పర్యవేక్షణలో ఉన్న పాలిటెక్నిక్, ఏటీసీలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తే డిప్లొమా, ఏటీసీ విద్యార్థుల సర్టిఫికెట్లకు విశ్వవిద్యాలయ హోదా లభించనుంది. వారికి ఉద్యోగ మార్కెట్‌లో మరింత విలువ పెరుగుతుంది. డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థుల మాదిరిగా సామాజిక గుర్తింపు దక్కనుంది. ఇది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఉన్నత విద్యలో ముందుకు సాగడానికి దోహదపడుతుంది. ప్రస్తుతం లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్‌లో చేరే డిప్లొమా విద్యార్థులకు పరిమిత సీట్లే అందుబాటులో ఉన్నాయి. స్కిల్ వర్సిటీలో ఇంజినీరింగ్ ప్రవేశపెడితే.. ఈ అవకాశాలు విస్తృతమవుతాయి. పరిశ్రమల భాగస్వామ్యంతో కళాశాలల్లో మౌలిక వసతులు, ప్రయోగశాలల మెరుగుతోపాటు ప్రాంగణ నియామకాల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కరిక్యులమ్ రూపకల్పనలో సౌలభ్యంతోపాటు పారి శ్రామిక ట్రెండ్‌కు అనుగుణంగా ఏటా సిలబస్‌ను నవీకరించుకునే అవకాశం ఉంది.
ఢిల్లీ అనుభవాలు..
తెలంగాణ కంటే ముందే ఢిల్లీ ప్రభుత్వం ఈ ప్రయోగాన్ని ప్రారంభించింది. విద్య, ఉపాధి మధ్య నైపుణ్య లోటును భర్తీ చేస్తూ సొంతంగా వ్యాపారాలు ప్రారంభించేలా విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో 2020లో ఢిల్లీ స్కిల్ అండ్ అంట్రప్రెన్యూర్‌షిప్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. పాలిటెక్నిక్‌లు, ఐటీఐలు, ఇతర స్కిల్ సెంటర్లను విలీనం చేసి, విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలుగా మార్చింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిప్లొమా నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు కోర్సులను రూపొందించి, ఉపాధి అవకాశాలు పెరిగేలా కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానించింది. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్‌ను పాఠ్యాంశాల్లో అంతర్భాగం చేసింది. అయితే, కొన్ని అంశాల్లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ సవాళ్లు ఎదురయ్యాయి. వర్సిటీ హోదా రాగానే కోర్సుల ఫీజులు పెరగడం విద్యార్థుల నిరసనలకు దారితీసింది. కొన్ని పాత పాలిటెక్నిక్ కళాశాలల భవనాలు, మౌలిక సదుపాయాలు మెరుగుపడలేదనే వార్తలు వచ్చాయి. కొత్త కోర్సులను ప్రవేశపెట్టినా.. విద్యార్థులు సంప్రదాయ కోర్సులకే మొగ్గు చూపడంతో ప్రవేశాలు తగ్గాయి. ఈ విద్యాసంవత్సరంలో డిప్లొమా ప్రవేశాలు 44 శాతం తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అధ్యాపకులకు తగిన శిక్షణ లేకుండా విశ్వవిద్యాలయ విధానానికి మార్చడం పరిపాలన సమస్యలకు దారి తీసింది.
తెలంగాణకు పాఠాలు
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం అందుబాటు ఫీజులతో అందిస్తున్న ఏటీసీ, పాలిటెక్నిక్ కోర్సులను కొనసాగిస్తూ, గ్రామీణ విద్యార్థులపై ఫీజుల భారం పడకుండా చూడాలి. అన్ని కళాశాలల్లో వసతులను దశలవారీగా మెరుగుపరిచి, ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవాలి. పరిశ్రమలతో అనుసంధానం ఉపాధి అవకాశాలు పెంచేలా ఉండాలి. మార్కెట్ అవసరాలతోపాటు విద్యార్థులు, తల్లిదండ్రుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని కొత్త కోర్సులను రూపొందిస్తే ప్రవేశాలు పెరుగుతాయి. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో మన విద్యార్థులు మరింత అభివృద్ధి చెందాల్సి ఉంది. ముఖ్యంగా ఆంగ్ల భాషా ప్రావీణ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అధ్యాపకులకు శిక్షణ అందించి, యూనివర్సిటీ స్థాయి మార్పులకు సిద్ధం చేయాలి. ఉద్యోగుల సర్వీసు నిబంధనలను స్పష్టంగా నిర్ధారించి, వారికి భరోసా కల్పించడం మరో ముఖ్యమైన అంశం.
సింగపూర్ నమూనా
ప్రపంచంలో నైపుణ్య విద్యలో సింగపూర్‌కు మంచి పేరుంది. అక్కడ విద్య, పరిశ్రమల మధ్య బలమైన అనుసంధానం ఉంది. పాలిటెక్నిక్ కళాశాలల్లోనే పరిశ్రమలు తమ కార్యాలయాలు, ప్రయోగశాలలను ఏర్పాటు చేసి, విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని కల్పిస్తున్నాయి. సుమారు 90 శాతం మంది పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్లు చదువు పూర్తయిన ఆరు నెలల్లోనే అత్యుత్తమ వేతనాలతో ఉద్యోగాలు సాధిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు నిరంతర విద్యా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నమూనా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ప్రేరణ కావాలి. అన్ని నైపుణ్య కోర్సులను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం వృత్తివిద్యలో ఒక కీలక మైలురాయి. ఢిల్లీ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని, సింగపూర్ నమూనాను అనుసరిస్తూ పరిశ్రమల భాగస్వామ్యంతో ముందుకుసాగితే నైపుణ్య విద్యలో తెలంగాణ ‘యంగ్ ఇండియా’ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.
- డా.అజేయ్ శివర్ల, ఇంగ్లిష్ లెక్చరర్
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
