వడ్ల కొనుగోలులో రికార్డ్.. ముగిసిన వానాకాలం సీజన్ కొనుగోళ్లు

వడ్ల కొనుగోలులో రికార్డ్..  ముగిసిన వానాకాలం సీజన్ కొనుగోళ్లు
  • 11.57 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు.. రూ. 2667 కోట్లు పేమెంట్ 
  • సన్న రకాలకు క్వింటాల్ కు  రూ. 500 చొప్పున బోనస్ రిలీజ్ 

యాదాద్రి, నల్గొండ, వెలుగు: వడ్ల కొనుగోలులో ఉమ్మడి నల్గొండ రికార్డు సృష్టించింది. మిల్లర్లు, ట్రేడర్లు, దళారులు రంగంలోకి దిగి పోటీగా కొనుగోళ్లు చేసినప్పటికీ  సివిల్​సప్లయ్​ డిపార్ట్​మెంట్​ గతం కంటే ఎక్కువగానే ధాన్యం  కొనుగోలు చేసింది. రైతుల అకౌంట్లలో డబ్బులు వెంట వెంటనే జమ చేసింది. గతంలో ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు బోనస్​ కూడా రిలీజ్​ చేస్తోంది. 

11.57 లక్షల టన్నుల కొనుగోలు

ఉమ్మడి జిల్లాలో 2025 వానాకాలం సీజన్​ వడ్ల కొనుగోళ్లు ముగిశాయి. ఎప్పటిలాగానే ఈసారి కూడా మిల్లర్లు, ట్రేడర్లు, దళారులు వడ్ల కొనుగోలు రంగంలో నిలిచారు. మద్దతు ధరతో పాటు ఈసారి సన్న వడ్లకు బోనస్​ కూడా ఇస్తామని సర్కారు ప్రకటించడంతో ఈసారి సివిల్​ సప్లయ్​ సెంటర్ల వైపు మొగ్గు చూపారు. అయినప్పటికీ... నిర్ణయించుకున్న టార్గెట్​ చేరుకోకున్నా.. గత సీజన్ల కంటే సివిల్​ సప్లయ్ శాఖ ఎక్కువగా ధాన్యం కొనుగోలు చేసింది.

యాదాద్రి జిల్లాలో గత సీజన్​లో 2.09 లక్షల టన్నులు కొనుగోలు చేయగా ఈసారి 3.18 లక్షల టన్నులు కొనుగోలు చేసింది.  ఇందులో 10,201 టన్నులు సన్నాలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 3.27 లక్షల టన్నులు కొనుగోలు  చేయగా ఇందులో 2 . 27 లక్షల టన్నులు సన్నాలే. నల్గొండ జిల్లాలో 5.12 లక్షల టన్నులు కొనుగోలు  చేయగా ఇందులో 1.40 లక్షల టన్నుల సన్నొడ్లు ఉన్నాయి. 

ఫాస్ట్​గా పేమెంట్​.. 

రైతులకు పేమెంట్​ కూడా ఈసారి ఫాస్ట్​గా వేశారు. కొనుగోలు చేసిన మూడు నుంచి ఐదు రోజుల్లో రైతుల అకౌంట్లలో పేమెంట్​ జమ చేశారు. యాదాద్రి జిల్లాలో కొనుగోలు చేసిన 3.18 లక్షల టన్నుల వడ్లకు మద్దతు ధర రూ. 717.57 కోట్లు కాగా ఇప్పటివరకూ రూ. 748.15 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేసింది. సూర్యాపేట జిల్లాలో కొనుగోలు చేసిన 3.27 లక్షల టన్నులకు రూ. 782.59  కోట్లు జమ చేసింది. నల్గొండ జిల్లాలో కొనుగోలు  చేసిన 5.12 లక్షల టన్నులకు గాను రూ 1168 కోట్లు జమ చేసింది. మిగిలిన మొత్తం కూడా ఈ వారంలో జమ చేయనుంది. 

బోనస్​ కూడా జమ

సన్న వడ్లను అమ్మిన రైతులకు క్వింటాల్​కు రూ. 500 బోనస్​ ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం కొనుగోలు చేసిన సన్న వడ్లకు బోనస్​ రిలీజ్​ చేస్తోంది. యాదాద్రి జిల్లాలో సన్నొడ్లు అమ్మిన 2854 మంది రైతులకు రూ. 5.75 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకూ రూ. 2.24 కోట్లు జమ చేసింది. సూర్యాపేట జిల్లాలోనూ రూ. 113 కోట్లు జమ చేయాల్సి ఉండగా ఇప్పటివరకూ రూ. 25 కోట్ల వరకూ జమ చేశారు. నల్గొండ జిల్లాలో రూ. 70 కోట్ల బోనస్​ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకూ రూ. 17.41 కోట్లు జమ చేసింది.