జార్ఖండ్ లో హింసాత్మకంగా మారిన నిరసనలు

జార్ఖండ్ లో హింసాత్మకంగా మారిన నిరసనలు

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు చేపట్టారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో నిరసనకారులు, పోలీసుల మధ్య హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ అల్లర్లలో గాయపడిన ఇద్దరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ హౌరా జిల్లాలో ఘర్షణలు జరిగాయి. 

రాంచీలోని హనుమాన్ ఆలయం దగ్గర స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రహదారులపై బైటాయించిన వారిపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. తుపాకీ గాయల కారణంగా చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలేనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఘర్షణ దృష్ట్యా రాంచీలో కర్ఫ్యూ విధించారు. రేపటి వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రబలగాలు మోహరించాయి. కాగా.. నిన్ జరిగిన అల్లర్లలలో తీవ్రంగా గాయపడిన 13 మంది హాస్పిటల్ లో చేరినట్లు తెలిపారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు అధికారులు. 

హౌరా పాంచ్లా బజార్ లో ఉదయం ఆందోళనకారులు నిరసన చేపట్టారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి అల్లరి మూకలు రాళ్లు విసిరారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు టియర్ గ్యాస్ వాడారు. ఈ నెల 15 వరకు సెక్షన్ 144 విధించారు.