విద్యార్థుల హత్య కేసు.. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ

విద్యార్థుల హత్య కేసు.. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ

జూలైలో మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థులను దారుణంగా హత్య చేసిన కేసులో నలుగురు వ్యక్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. వారి ఫొటో గత వారమే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ నలుగురిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలున్నారు. వీరిలో ఇద్దరు మైనర్లను అస్సాంలోని గౌహతికి తరలించారు. ఇద్దరు మైనర్లను వారి సంక్షేమం, రక్షణ, సంరక్షణ కోసం కామ్రూప్ మెట్రో జిల్లాలోని బాలల సంరక్షణ అధికారికి అప్పగించినట్లు సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

నిందితులను పావోమిన్‌లున్ హాకిప్, మల్సాన్ హాకిప్, లింగ్‌నీచాంగ్ బైట్, తిన్నెఖోల్‌లుగా గుర్తించారు. హత్యకు గురైన విద్యార్థినికి లింగ్‌నీచాంగ్ బైట్ స్నేహితుడని సమాచారం. అనుమానితుల్లో ఒకరు చురచంద్‌పూర్‌లో ఉన్న తిరుగుబాటు గ్రూపు సభ్యుని భార్య అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మే 3న జాతి హింస ప్రారంభమైన ఇంఫాల్‌కు 51 కి.మీ దూరంలో ఉన్న హిల్ జిల్లా చురచంద్‌పూర్ నుంచి మణిపూర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ కలిసి చేసిన ఆపరేషన్‌లో నిందితులను పట్టుకున్నారు. వారిని పట్టుకున్న తర్వాత, బలగాలు అత్యంత వేగంగా విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడ సీబీఐ బృందం వారి కోసం వేచి ఉంది. సీబీఐ బృందం, అనుమానితులు సాయంత్రం 5:45 గంటలకు ఇంఫాల్ నుంచి చివరి విమానంలో బయలుదేరారు. వారు అక్కడ్నుంచి వెళ్లే వరకు విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత ఉంది.

"నేరం చేసిన తర్వాత ఎవరైనా పరారీలో ఉండవచ్చు. కానీ వారు చట్టం నుంచి తప్పించుకోలేరు. వారు చేసిన ఘోరమైన నేరానికి ఉరిశిక్షతో సహా అంతకంటే ఎక్కువ శిక్షను వేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం" అని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ గతంలోనే తెలిపారు.