- రూ.17 కోట్ల ఇంజెక్షన్ కోసం
న్యూఢిల్లీ : వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న 16 నెలల చిన్నారి కోసం రూ.17 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను కొనుగోలు చేయడానికి క్రౌడ్ ఫండింగ్‌కు సహకరించాలని ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సంజయ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీకి చెందిన 16 నెలల వెహంత్ జైన్ అనే బాలుడు వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్నాడని పేర్కొన్నారు.
అతనికి రెండేళ్ల వయసులోపు రూ.17.5 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇవ్వకపోతే తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటాడని తెలిపారు. బాలుడి తండ్రి ఇంజినీర్, తల్లి సీఏగా పనిచేసేదని, అయితే.. బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉన్నందున ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టారని ఆయన తెలిపారు. ఆ చిన్నారి ప్రాణాలను కాపాడాలని ప్రజలకు సంజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. రూ.100 నుంచి రూ.1 లక్ష వరకు సాయం అందించి సహకరించాలని ఆయన కోరారు.
ఆప్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ముందుకు రావాలన్నారు. తన వంతుగా లక్ష అందిస్తున్నానని ఆయన చెప్పారు. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) అనేది అరుదైన వ్యాధి. దీని బారిన పడితే.. మెదడు నుంచి కండరాలకు సంకేతాలను తీసుకువెళ్లే నాడీ కణాలను కోల్పోతుంది. ఎస్ఎంఏతో బాధపడుతున్న రెండేండ్లలోపు పిల్లలకు జోల్జెన్స్మా అనే ఇంజెక్షన్ ఇస్తారు.