
ఖమ్మం టౌన్, వెలుగు : ఐటీఐ, ఏటీసీ సెంటర్లలో ఉన్న కోర్సులకు జిల్లాలో ప్రచారం కల్పించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అధికారులకు సూచించారు. ఐటీఐ ప్రవేశాలు, అక్షరాస్యత, పారిశుధ్య నిర్వహణ, పెట్రోలు పంపు ఏర్పాటు, తదితర అంశాలపై మంగళవారం ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయ మీటింగ్ హాల్ లో ఆమె అధికారులతో సమీక్షించారు. జిల్లాలో బీపీసీఎల్, ఐఓసీఎల్ ప్రతినిధులతో కలిసి గుర్తించిన స్థలాలను పరిశీలించి పెట్రోల్ బంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఏదులాపురం, రఘునాథపాలెం, మధిర, సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలం తఎంపిక చేయాలని ఆదేశించారు. ఐటీఐ, ఏటీసీ కేంద్రాల్లో మొత్తం 255 సీట్లు ఖాళీగా ఉన్నాయని, కోర్సుల పట్ల యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటర్ డ్రాప్ అవుట్ విద్యార్థుల వివరాలను సేకరించి, ఈ కోర్సుల్లో జాయిన్ అయ్యేలా చూడాలన్నారు. జిల్లాలో అక్షరాస్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. 10వ తరగతి పాస్ కాని వారిని గుర్తించి, వారికి చదువుపై అవగాహన కల్పించి ఆగస్టు 5 వరకు ఓపెన్ స్కూల్ లో జాయిన్ చేయాలని సూచించారు.
స్కూళ్లలో ఎక్కడైనా టాయిలెట్, కాంపౌండ్ వాల్ రిపేర్లు ఉంటే మున్సిపాలిటీల ద్వారా ఆగస్టు 10 లోపు ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు. మున్సిపాలిటీలలో ఉన్న జూనియర్ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ లేకపోతే వెంటనే కనీసం 5 కంప్యూటర్ లతో ల్యాబ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఎస్.సత్యనారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, ఆర్డీఓ నరసింహా రావు, అడిషనల్ డీఆర్డీవో జయశ్రీ, ఖమ్మం మున్సిపల్ సహాయ కమిషనర్ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్ పాల్గొన్నారు.