రేపటి నుంచి రైతుల ముందుకు సైంటిస్టులు .. జయశంకర్ వర్సిటీ వీసీ జానయ్య వెల్లడి

రేపటి నుంచి రైతుల ముందుకు సైంటిస్టులు .. జయశంకర్ వర్సిటీ వీసీ జానయ్య వెల్లడి
  • జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ వినూత్న కార్యక్రమం
  • మే 5 నుంచి జూన్ 13 వరకు నిర్వహణ

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర రైతాంగానికి అధునాతన సాగు టెక్నాలజీ, శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సరికొత్త కార్యక్రమాన్ని చేపడుతోంది. సోమవారం నుంచి "రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" పేరుతో ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. శనివారం సైఫాబాద్‌‌లోని కమ్యూనిటీ సైన్స్ కాలేజీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య వివరాలను  వెల్లడించారు. ఈ కార్యక్రమం మే 5 నుంచి జూన్ 13 వరకు రాష్ట్రంలోని దాదాపు 1200 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. దీని కోసం 200 మంది సైంటిస్టులతో కూడిన బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయని చెప్పారు.

 సెలవు దినాలు మినహా ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రైతు వేదికలు లేదా ఇతర నిర్దేశించిన ప్రదేశాల్లో సైంటిస్టులు రైతులతో సమావేశం అవుతారని  తెలిపారు. ప్రతి బృందంలో ఇద్దరు సైంటిస్టులు, వ్యవసాయ శాఖ అధికారులు, అగ్రికల్చర్ స్టూడెంట్లు, స్థానిక ప్రభుత్వ శాఖల సిబ్బంది, అభ్యుదయ రైతులు ఉంటారన్నారు. అలాగే, స్థానిక ప్రజా ప్రతినిధులు, టీచర్లు, విద్యార్థులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేర్చనున్నట్లు వీసీ వెల్లడించారు. దీనిని ఒక సామాజిక ఉద్యమంగా నిర్వహిస్తామని తెలిపారు. రైతులు, రైతు కూలీలు, గవర్నమెంట్ టీచర్లు, అభ్యుదయ రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

డిగ్రీ అడ్మిషన్లలో రైతుల పిల్లలకు కోటా.. 

రైతు ముంగిట్లోకి సైంటిస్టులు కార్యక్రమంలో వర్సిటీ పరిధిలోని అగ్రికల్చర్ కాలేజీలు, పాలిటెక్నిక్‌‌లు, వ్యవసాయ పరిశోధన సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు భాగస్వామ్యం అవుతాయని ప్రొఫెసర్ జానయ్య చెప్పారు. వర్సిటీ ఉన్నతాధికారులు, రీసెర్చ్​ డైరెక్టర్​, కళాశాల డీన్‌‌లు పర్యవేక్షిస్తారని తెలిపారు. అగ్రికల్చర్ డిగ్రీ అడ్మిషన్లలో రైతుల పిల్లలకు 40 శాతం ప్రత్యేక కోటా ఉందని, ఈ ఏడాది నుంచి రైతులకు 25 శాతం, రైతు కూలీల పిల్లలకు 15 శాతం కోటా సీట్లు కేటాయిస్తామని వివరించారు. 

వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో సహకరిస్తోందని తెలిపారు. టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ..  గవర్నమెంట్ టీచర్లు తమ ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కోరారు. వర్సిటీ డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్, నోడల్ అధికారి డాక్టర్ చల్లా వేణుగోపాల్ రెడ్డి కార్యక్రమం షెడ్యూల్ ను మీడియాకు వివరించారు. 

అవగాహన కల్పించే అంశాలివే..
  
సాగులో టెక్నాలజీ వినియోగం, యూరియా వాడకం తగ్గించడం, రసాయనాల సమర్థ వినియోగం ద్వారా నేల సారాన్ని కాపాడటం వంటి అంశాలను ఈ కార్యక్రమంలో రైతులకు వివరిస్తారు. సాగు నీటి సమర్థ వినియోగం, పంటల మార్పిడి, చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు.