అందరి ఆమోదంతోనే డీసీసీ కొత్త అధ్యక్షులు : నారాయణ స్వామి

అందరి ఆమోదంతోనే డీసీసీ కొత్త అధ్యక్షులు :  నారాయణ స్వామి
  • ఏఐసీసీ పరిశీలకుడు నారాయణ స్వామి

నాగర్​కర్నూల్, వెలుగు: పార్టీ కోసం పని చేసే కార్యకర్తలు, నాయకుల  ఆమోదంతో ఏఐసీసీ అనుమతితో కొత్త డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని ఏఐసీసీ పరిశీలకుడు, పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి తెలిపారు. ఆదివారం నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఇంట్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల డీసీసీ అధ్యక్షుల ఎన్నికల కోసం ఏఐసీసీ పరిశీలకుడిగా వచ్చినట్లు తెలిపారు.

 జిల్లా నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల సభ్యుల అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపారు. పార్టీ కోసం చేసిన కృషి, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఐదుగురి పేర్లతో లిస్ట్​ను ఈ నెల 22న ఏఐసీసీకి పంపిస్తామని చెప్పారు. మూడు రోజులపాటు నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

 రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్  పార్టీ కృతనిశ్చయంతో ఉన్నాయని చెప్పారు. తమిళనాడులో 69 శాతం, కర్నాటకలో 52 శాతం రిజర్వేషన్లు జ్యుడీషియరీ రివ్యూ అనంతరం సుప్రీం తీర్పు ప్రకారం అమలు చేశారని గుర్తు చేశారు. డెడికేటెడ్  బీసీ కమిషన్​ ఏర్పాటు చేసి వారి సామాజిక, ఆర్థిక, ఇతర స్థితిగతుల ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తే,  బీజేపీ కుట్రలతో బీసీలకు రిజర్వేషన్ల ఫలాలు దక్కకుండా పోయే పరిస్థితి తలెత్తిందన్నారు. నాగర్ కర్నూల్, కల్వకుర్తి ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ అమీర్  అలీ ఖాన్, టీపీసీసీ అబ్జర్వర్లు బొజ్జ సంధ్యారెడ్డి, సాంబుల శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్, కోటేశ్, లైబ్రరీ చైర్మన్  రాజేందర్ పాల్గొన్నారు.

దరఖాస్తు చేసుకోండి..

మహబూబ్ నగర్ అర్బన్: నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలతోనే డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ నారాయణ స్వామి తెలిపారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంఘటన్  సృజన్  అభియాన్  కార్యక్రమంలో భాగంగా ఆదివారం కాంగ్రెస్  ఆఫీస్ లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డితో కలిసి  మీడియాతో మాట్లాడారు. 

నియోజకవర్గాలు, బ్లాక్  వారీగా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు. పీసీసీ అబ్జర్వర్లు శ్రీగణేశ్, మెట్టు సాయి, ఉజ్మ షకీర్, మైనారిటీ ఫైనాన్స్  కార్పొరేషన్  చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, పీసీసీ జనరల్ సెక్రటరీ సంజీవ్  ముదిరాజ్, పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్దన్ రెడ్డి, జహీర్  అక్తర్, ముడా చైర్మన్  లక్ష్మణ్  యాదవ్, మార్కెట్  కమిటీ చైర్మన్  బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వినోద్ కుమార్, వసంత, సిరాజ్ ఖాద్రి, సీజే బెనహర్  పాల్గొన్నారు.