రేపు శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న అమిత్ షా

రేపు శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న అమిత్ షా

కర్నూలు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు (గురువారం) ఏపీలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు దిల్లీలో బయలుదేరి 11.15 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ప్రైవేటు హెలికాఫ్టర్ లో శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.25 గంటలకు సున్నిపెంటకు వచ్చి రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్య శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారి ఆలయానికి చేరుకుని మల్లన్నను దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు భ్రమరాంబ అతిథిగృహంలో భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ నుంచి 3.50 గంటలకు దిల్లీకి తిరిగి చేరుకుంటారు. 
అమిత్ షా పర్యటన చివరి నిమిషం వరకు ఎవరికీ తెలియకపోవడంతో అధికార యంత్రాంగం.. ఏపీ ప్రజా ప్రతినిధులు హడావుడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం విజయవాడలోని తన నివాసం నుండి శ్రీశైలానికి బయలుదేరారు. రోడ్డు మార్గాన అర్ధరాత్రి దాటిన తర్వాత 2  గంటలకు శ్రీశైలం చేరుకుని అక్కడే బస చేస్తారు. కేంద్ర హోం మంత్రికి సంప్రదాయబద్దంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వ నేతలతోపాటు.. బీజేపీ నేతలు కూడా శ్రీశైలం వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.