ఆర్మూర్ అభివృద్ధికి కృషి చేస్తా : సుదర్శన్ రెడ్డి

ఆర్మూర్ అభివృద్ధికి కృషి చేస్తా :  సుదర్శన్ రెడ్డి
  • ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్​ రెడ్డి

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం టీయూఎఫ్ ఐడీసీ ద్వారా ఆర్మూర్ మున్సిపల్​కు మంజూరైన రూ.27 కోట్ల 20 లక్షల నిధులతో 36 వార్డుల్లో చేపట్టనున్న బీటీ, సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి తో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు.  ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మలివిడత టీయూఎఫ్ ఐడీసీ ద్వారా రూ.19 కోట్ల 62 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేసుకుందామన్నారు.  ప్రత్యేక నిధులు రూ.18 కోట్ల 70 లక్షలు ఆర్మూర్​కు మంజూరయ్యాయని, టెండర్లు పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామన్నారు.  

శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి అమృత్ పథకం ద్వారా రూ.43 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.  గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మున్సిపల్​గా అప్​గ్రేడ్​ అయిన ఆర్మూర్ లో అభివృద్ధి పనులు జరగలేదన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు మంజూరవుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.  

బోధన్ తో సమానంగా ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి బోధన్ ఎమ్మెల్యే మరింత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, వక్ఫ్​ బోర్డ్​ చైర్మన్ తాహెర్​ బిన్​ హందాన్, మానాల మోహన్​ రెడ్డి, మార్కెట్​ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మోత్కూరి లింగాగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ మందుల బాలు, పోల్కం వేణు, కలిగోట్ గంగాధర్, సుంకరి రంగన్న  తదితరులు  పాల్గొన్నారు.