రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఉత్తమ సంతానం కోసం ‘ఆర్యజనని’

రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఉత్తమ సంతానం కోసం ‘ఆర్యజనని’

హైదరాబాద్: ప్రతి తల్లి, తండ్రి తమకు ఉత్తమమైన సంతానం కలగాలని కోరుకుంటారు. తమ సంతానం సంతోషంగా జీవించాలని పాటుపడతారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో చాలా మంది చిన్నారులు పుట్టుకతోనే ఎన్నో సమస్యలతో జన్మిస్తున్నారు. ఇలాంటి విపత్తులు తలెత్తకుండా ఉండాలంటే తల్లి గర్భంతో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వీటిని అందరికీ తెలియజేసేందుకు, ఉత్తమమైన భవిష్యత్ తరాలను తయారు చేసే లక్ష్యంతో రామకృష్ణ మఠం అద్భుతమైన కార్యక్రమం ‘ఆర్యజనని’కి శ్రీకారం చుడుతోంది.బుధవారం నాడు హైదరాబాద్‌ లోయర్ ట్యాంక్ బండ్ లోని రామకృష్ణ మఠంలో  ప్రత్యేక సమావేశం జరిగింది. ఇందులో వీఐఓఎల్ (వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్) డైరెక్టర్ స్వామి శితికంఠానంద  ‘ఆర్యజనని’ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. బిడ్డ గర్భంలో ఉండగా తల్లిదండ్రులు చేసే పనులు, తీసుకునే జాగ్రత్తలు శిశువు పుట్టిన తర్వాత ప్రభావం చూపుతాయని, ఆధునిక సైన్స్ ఈనాడు చెప్తున్న అనేక విషయాలను మన పురాణాలు, ఉపనిషత్తులు వేల సంవత్సరాల క్రితమే వెల్లడించాయని స్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యజనని బృంద సభ్యులు కూడా పాల్గొని పలు అంశాలపై చక్కని వివరణలు ఇచ్చారు.
ఉత్తమ సంతానం కోసం ఏం చేయాలంటే..
భాగ్యనగరంలోని రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో బుధవారం  ఆర్యజనని కార్యక్రమాన్ని చేపట్టారు. కలిగే సంతానం ఉత్తమంగా ఉండటానికి ఎటువంటి మార్గాలు అనుసరించాలో తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీనికోసం ఉత్తమమైన భవిష్యత్ తరాలను తయారు చేసే లక్ష్యంతో ‘మేధ’ పేరుతో ఆర్యజనని బృందం వర్క్ షాప్‌లు నిర్వహిస్తోంది. ఈ వర్కు షాపుల్లో విలువైన సూచనలిస్తూ కాబోయే తల్లిదండ్రులకు మార్గనిర్దేశనం చేస్తారు. ఆగస్ట్ 7వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. 
ఆర్యజనని టీమ్‌లో అనుభవజ్ఞులైన డాక్టర్లు, సైకాలజిస్టులు
భావి భారతదేశంలో అర్థవంతమైన పౌరులను చూడాలనే లక్ష్యంతో ఆర్యజనని టీమ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ టీమ్ లోని అనుభవజ్ఞులైన డాక్టర్లు, సైకాలజిస్టులు, ఇతర నిపుణులు తల్లితో పాటు కడుపులో పడక ముందు.. పడిన తర్వాత తీసుకోవాల్సిన విషయాలను విపులంగా తెలియజేస్తారు. అలాగే తల్లి గర్బంలో పెరుగుతున్న శిశువు శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆర్యజనని బృందం అవగాహన కల్పిస్తుంది. పుట్టబోయే బిడ్డ శారీరక ఆరోగ్యంతో ఆహ్లాదకరంగా పెరిగేలా ధ్యానం, భజనలు, యోగాసనాలు తదితర విషయాలు నేర్పడంతోపాటు, బిడ్డ ఎదుగుదలలో వాటి ప్రాధాన్యతను సవివరంగా చెప్తారు. అలాగే గర్భిణులకు ఉపయోగపడే దినచర్యను తెలియజేస్తారు. 
ఈ కార్యక్రమంలో పేరు నమోదు చేసుకోవాలంటే..
ఆర్యజనని కార్యక్రమంలో తమ పేరు నమోదు చేసుకోవాలని అనుకున్న వాళ్లు www.aaryajanani.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని నిర్వాహకులు తెలిపారు. శిశువు తల్గి గర్బంలో పిండ దశలో ఉన్నప్పుడు లభించే ప్రేరణ, సంస్కారమే.. ఆ శిశువు అద్భుతమైన వ్యక్తిగా ఎదగడానికిగానీ లేదంటా చెడుగా మారడానికిగానీ కారణభూతం అవుతుందని ఆర్యజనని బృందం విపులంగా అర్థమయ్యేలా వివరిస్తుంది. సంస్కారవంతులైన, దైవం పట్ల భక్తి, శ్రద్ధలు కలిగిన తల్లులకు ఉన్నతమైన బిడ్డలు జన్మిస్తారని స్వామి వివేకానంద చెప్పిన మాటల స్ఫూర్తితో ఆర్యజనని కార్యక్రమం రూపుదిద్దుకుంది. శిశువు జననానికి సంబంధించిన ఆధునిక విజ్ఞానం కూడా ఈ కార్యక్రమం ద్వారా అందించనున్నారు.