‘కేసీఆర్‍ను తిట్టడమే పనిగా పెట్టుకున్నరు’
కుల,మతాలను రెచ్చగొట్టి బీజేపీ లబ్ధిపొందుతోంది: మంత్రి ఎర్రబెల్లి
వరంగల్, వెలుగు: బీజేపీ లీడర్లు.. రాష్ట్ర సర్కారును, సీఎం కేసీఆర్‍ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‍శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ నేపథ్యంలో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే అరూరి రమేశ్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్‍రాజ్, నాగుర్ల వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? రైతుబంధు, రైతుబీమా, పెన్షన్లు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్‍రెడ్డి నిధుల విషయంలో అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కిషన్‍రెడ్డి, బండి సంజయ్ తో తాను బీజేపీ రాష్ట్రాల్లో పాదయాత్రకు సిద్ధమని, తెలంగాణలో అమలవుతున్న స్కీంలు అక్కడ ఉంటే క్షమాపణలు చెబుతానన్నారు. లేదంటే ఇరువురు తప్పు ఒప్పుకోవాలని డిమాండ్‍చేశారు. బీజేపీ కులమతాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తోందని మండిపడ్డారు. పాదయాత్రలో ప్రజలు ప్రశ్నిస్తే, బీజేపీ లీడర్లు దాడులు చేశారన్నారు. ముగింపు సభలో మాట్లాడిన బీజేపీ పెద్దలు నడ్డా, కిషన్‍రెడ్డి, సంజయ్ ప్రసంగాల్లో పస లేదని కామెంట్‍చేశారు.
సాగు నీళ్లు కావాలని రోడ్డెక్కిన రైతులు
వెంకటాపురం, వెలుగు: పొలాలకు నీళ్లు విడుదల చేయాలని ములుగు జిల్లా వెంకటాపురం పరిధిలోని పాలెం వాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం వెంటాపురం–వాజేడు మెయిన్ రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... చుక్క నీళ్లు లేక ప్రాజెక్టు కింద ఉన్న 14 గ్రామాల్లో దాదాపు 5వేల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలెం ప్రాజెక్టు ద్వారా వెంటనే నీళ్లు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో చిరుతపల్లి, బర్లగూడెం, నూగుర్, వంటిమామిడి, బెస్తగూడెం గ్రామాల రైతులు ఉన్నారు. కాగా, వీరి ధర్నాకు స్థానిక సర్పంచ్ నరసింహమూర్తి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మూడేండ్ల నుంచి పాలెం వాగు కాలువకు రిపేర్లు చేయకపోవడంతో చాలా చోట్ల గండ్లు పడ్డాయన్నారు. ప్రాజెక్టు నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు, రైతులకు సర్దిచెప్పారు. రెండ్రోజుల్లో సాగునీరు అందిస్తామని ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో రైతులు వెనక్కి తగ్గారు.
వీఆర్ఏల గోస వినాలె
ములుగు, వెలుగు: వీఆర్ఏల గోస ప్రభుత్వం విని, స్పందించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. 34రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శనివారం ఆమె ములుగులో నిర్వహిస్తున్న వీఆర్ఏల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పేస్కేల్ అమలు చేయాలన్నారు. అర్హులకు ప్రమోషన్లు, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.
విద్యాలయాలను పట్టించుకోని ప్రభుత్వం..
రాష్ట్రంలోని కాలేజీలు, స్కూళ్లను టీఆర్ఎస్ సర్కార్ గాలికొదిలేసిందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. శనివారం ములుగు ప్రభుత్వ జూనియర్ కాలేజీని సందర్శించారు. స్టూడెంట్లతో కలిసి పిచ్చి మొక్కలు తొలగించారు. టాయిలెట్లు, క్లాస్ రూంలు అధ్వానంగా ఉండడంతో వాటిని బాగు చేయాలని కలెక్టర్‌కు, విద్యాశాఖ కమిషనర్‌కు ఫోన్ చేసి తెలిపారు.
ఆసరా పెన్షన్ల పంపిణీ నిరంతర ప్రక్రియ
రానోళ్లు అప్లై చేసుకోవచ్చు
ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పింఛన్ కార్డుల పంపిణీ
వేలేరు, రఘునాథపల్లి, వెలుగు: ఆసరా పెన్షన్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం ఆయన హనుమకొండ జిల్లా వేలేరు, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలకేంద్రాల్లో లబ్ధిదారులకు ఆసరా కార్డులు పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 57ఏండ్లు నిండిన వారికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. కార్డులు రాని వారు మళ్లీ అప్లై చేసుకోవాలని సూచించారు. అనంతరం వేలేరులో 16మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.
లబ్ధిదారులంతా ప్రోగ్రాంకు రావాలె..
మరిపెడ, వెలుగు: కొత్తగా పెన్షన్లు పొందే లబ్ధిదారులు కార్డుల పంపిణీ కార్యక్రమానికి తప్పకుండా రావాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు. శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లకు కార్డుల పంపిణీపై అవగాహన కల్పించారు. లబ్ధిదారులంతా పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ఈనెల 28న చిన్నగూడూరు, 29న నర్సింహులపేట, 30న దంతాలపల్లి, వచ్చే నెల 1,2న కురవి, 3,4న డోర్నకల్, 5,6 న మరిపెడ మున్సిపాలిటీలో ఆసరా కార్డులు పంచుతామన్నారు.
ఓర్వలేక సర్కారుపై నిందలు..
రేగొండ, వెలుగు: టీఆర్ఎస్ సర్కారు అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలకేంద్రంలో ఆసరా కార్డులు పంపిణీ చేశారు. కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని ఆపలేదన్నారు. అధికారం కోసం ప్రతిపక్షాలు ప్రతీది రాజకీయం చేస్తూ, సర్కారుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
రక్తదానం చేయాలి..
నర్సంపేట, వెలుగు: రక్తదాతలే నిజమైన ప్రాణదాతలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం బ్లడ్ డోనేషన్ క్యాంప్నిర్వహించగా.. ఎమ్మెల్యే చీఫ్ గెస్టుగా పాల్గొని ప్రారంభించారు. ఆపదలో ఉన్న వారికి రక్తం దానం చేయడం వల్ల వారి ప్రాణాలు కాపాడే వారవుతామన్నారు.
ఆలయం చుట్టూ ఆవు ప్రదక్షిణలు
నర్సంపేట, వెలుగు: నర్సంపేట టౌన్‌లోని శ్రీ శివాంజనేయ స్వామి టెంపుల్లో ఓ ఆవు కొద్దిరోజులుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఆలయంలో శివుడు, హనుమాన్, లక్ష్మీమాత, నాగేంద్రస్వామి, సుబ్రమణ్యేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలున్నాయి. శ్రావణ మాసంలో ఓ రోజు ఆవు టెంపుల్‌లోకి ప్రవేశించి, గుడి చుట్టూ ప్రదక్షణలు చేయడాన్ని పూజారి రవీందర్‌శర్మ చూశాడు. వారానికి మూడు రోజులు ఆవు ఉదయం గుడిలోకి వచ్చి ప్రదక్షిణ చేశాక.. హనుమాన్ విగ్రహాన్నే చూస్తూ మూడు గంటల పాటు సేదతీరుతోందని చెప్పారు. భక్తులకు ఈ విషయం తెలియడంతో పెద్ద ఎత్తున తరలివచ్చి, పూజలు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద జెండా
తొర్రూరు, వెలుగు: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద జాతీయ జెండాను తొర్రూరులో ఏర్పాటు చేశారు. దీనిని ఈ నెల 29న అధికారికంగా ప్రారంభించనున్నట్లు జాతీయ పతాక ప్రతిష్టాపన కమిటీ చైర్మన్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు వెల్లడించారు. శనివారం కమిటీ సభ్యులతో పాటు మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డితో కలిసి జెండాను ప్రతిష్టించే స్థలాన్ని పరిశీలించారు. ఈ జెండా 30 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉంటుందన్నారు. ఇస్రో నిపుణుల సహకారంతో 100 అడుగుల స్తంభాన్ని రూపొందించామన్నారు. రూ.20లక్షల వెచ్చించి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశామన్నారు.
మెరిట్ స్టూడెంట్లకు సత్కారం
మహబూబాబాద్, వెలుగు: టెన్త్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గవర్నమెంట్ స్టూడెంట్లను మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం సత్కరించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో టెన్త్ లో 10 జీపీఏ సాధించిన 33మందిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో టెన్త్ ఫలితాల్లో 90శాతం ప్రభుత్వ స్టూడెంట్లు పాస్ కావడం అభినందనీయమన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ స్టూడెంట్లు అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు. కష్ట పడితే సాధించలేనిది ఉండదని సూచించారు. ఆ తర్వాత జిల్లాకేంద్రంలో సాగుతున్న మెడికల్ కాలేజీ, కలెక్టరేట్ నిర్మాణ పనుల్ని మంత్రి పరిశీలించారు. అనంతరం మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో ఆసరా పెన్షన్ కార్డులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్ పర్సన్ ఆంగోత్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ శశాంక, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి తదితరులున్నారు.
మండలం చేయాలని కేసీఆర్ కు లెటర్
ములుగు, వెలుగు: మల్లంపల్లిని మండలం చేస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్, నేటికీ నెరవేర్చలేదని ములుగు మండలం మల్లంపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లంపల్లిని మండలం చేయాలని కోరుతూ శనివారం సీఎం కేసీఆర్ కు లేఖ రాసి, పోస్టాఫీస్ ద్వారా ప్రగతిభవన్‌కు పంపారు. ఈ సందర్భంగా మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు మాట్లాడుతూ.. 32 రోజులుగా మండలం కోసం ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
