ఆటమ్ ఈ బైక్ ​ రెండో ఫ్యాక్టరీ షురూ

ఆటమ్ ఈ బైక్ ​ రెండో ఫ్యాక్టరీ షురూ
  • సోలార్​ రూఫ్​ నుంచి కరెంటు తయారీ
  • ఏడాదికి 3.50 లక్షల యూనిట్ల కెపాసిటీ

హైదరాబాద్​, వెలుగు:విశాక గ్రూపునకు చెందిన ఎలక్ట్రిక్​ వెహికల్స్​(ఈవీ) స్టార్టప్​ ఆటుమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ తమ బైకుల తయారీ కెపాసిటీని పెంచడానికి రెడీ అయింది. ఇందుకోసం పటాన్​చెరులో నిర్మించిన రెండో ఫ్యాక్టరీని గ్రూప్​ చైర్మన్​ గడ్డం వివేకానంద్​ దంపతులు, ఆటుమొబైల్​ ఫౌండర్​ గడ్డం వంశీ శుక్రవారం ప్రారంభించారు.  ఇక్కడ బైకుల తయారీకి పూర్తిగా క్లీన్​ఎనర్జీ (నెట్ జీరో తయారీ) వాడుతారు. ఇందుకోసం ఫ్యాక్టరీ పైకప్పును సోలార్​ ప్యానెల్స్​తో తయారు చేశారు. ఈ రెండు యూనిట్లలో ఏటా 3.50 లక్షల బైకులను తయారు చేయవచ్చు.  ప్రస్తుతం ఇక్కడ ఆటమ్ 1.0 కెఫే రేసర్ స్టైల్ ఎలక్ట్రిక్ బైకులని తయారు చేస్తున్నారు.  హై-స్పీడ్ మోడల్స్​ కూడా ఇక్కడే తయారు కాబోతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఇవి మార్కెట్​కు వస్తాయి.  ఈ స్టార్టప్​ పటాన్​చెరులో తమ మొట్టమొదటి ఫ్యాక్టరీని 2020 సంవత్సరంలో 25 వేల యూనిట్ల కెపాసిటీతో మొదలుపెట్టింది. 20 వేల చదరపు అడుగులకి పైగా విస్తరించి ఉన్న ఈ కొత్త ఫ్యాక్టరీ ద్వారా 300 మందికి ఉపాధి దొరుకుతుంది.  ఈ సందర్భంగా వంశీ  మాట్లాడుతూ “క్లీన్​ ఎనర్జీతో ఈవీలను తయారు చేయడం వల్ల ఇండియా పర్యావరణం పట్ల బాధ్యత గల దేశంగా ఎదుగుతుంది. అందుకే మేం దేశవ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్లకు కూడా సోలార్​ పవర్​ను వాడుతున్నాం.   ఇది వరకే వెయ్యి యూనిట్లను అమ్మాం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 50 వేల యూనిట్లను అమ్మాలని టార్గెట్ పెట్టుకున్నాం. అమ్మకాలను పెంచడానికి ‘వీల్స్​ ఆన్​ షోరూం’ను, ‘సర్వీస్​ ఆన్​ వీల్స్​’ను మొదలుపెట్టాం. మా వెబ్​సైట్​ ద్వారా బైక్​ను బుక్​ చేసుకున్న కొన్ని గంటల్లోపే డెలివరీ ఇస్తున్నాం. మా లో స్పీడ్ బైకు నాలుగు గంటల్లో పూర్తిగా చార్జ్​ అవుతుంది. దీనికి లైసెన్సు, ఆర్సీ బుక్​ అవసరం లేదు.    ధర రూ.55 వేలు. బైకు తయారీకి కావాల్సిన 90 శాతం భాగాలను లోకల్​గానే కొంటున్నాం”అని ఆయన వివరించారు.