ఆత్రేయపురం పూతరేకుల పోస్టల్ కవర్ రిలీజ్

ఆత్రేయపురం పూతరేకుల పోస్టల్ కవర్ రిలీజ్

కాకినాడ: గోదారోళ్ల ప్రత్యేక మిఠాయి ఆత్రేయపురం పూత రేకులు పేరు చెబితే తెలియని వాళ్లు అరుదు. దేశ వ్యాప్తంగా ఎంతో పేరు పొందిన ఈ ఆత్రేయపురం పూతరేకుల ఘనతను దేశవ్యాప్తంగా చాటి చెప్పేందుకు తపాళాశాఖ ముందుకొచ్చింది. ఎంతో చరిత్రకలిగిన, ప్రాధాన్యత కల వాటిపై తపాళా బిల్లలు, కవర్లు రిలీజ్ చేసే తపాళాశాఖ తాజాగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పూత రేకులపై ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ కవర్ ను విడుదల చేసింది. శనివారం విశాఖ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లు తపాళా కవర్ ను విడుదల చేశారు. 
ఈ కవర్ ధరను  రూ.20 లుగా నిర్ణయించారు. ఆత్రేయపురం పూత రేకుల తయారీ నే ప్రధాన వృత్తిగా స్థానికంగా 500కుపైగా కుటుంబాలు పనిచేస్తూ దేశంలోని నలుమూలలకు ఎగుమతి చేస్తున్న విషయం తెలిసిందే. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే పూత రేకులు గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్. చాలా కుటుంబాలు భారీ సంఖ్యలో పూత రేకులు తయారు చేస్తూ దేశం నలుమూలలకు ఆర్డర్లపై పంపిస్తున్న విషయం తెలిసిందే.