
-
హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆహ్వాన పత్రికలు
అయోధ్య: దివ్య సాకేతపురిలో ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్ లల్లా కొలువుదీరనున్నాడు. ఇందుకోసం రామ్ జన్మభూమి ట్రస్ట్ ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఆహ్వాన పత్రికలను ముద్రించింది. నిర్మాణమవుతున్న ఆలయ వైభవాన్ని ప్రతిఫలిస్తూ దేవాలయ, బాల రాముడి చిత్రాలను ముద్రించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆరెస్సెస్ అధిపతి మోహన్ భాగవత్, ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆలయ ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్‌ల సమక్షంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. సాధు సంతులు, మఠాధిపతులు సహా మొత్తం 7000 మందిని దేవాలయ ట్రస్టు ఆహ్వానించింది.
పర్యాటక ప్రదేశంగా దశరథ మహారాజు సమాధి
శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు మరణించిన తర్వాత ఆయనకు అయోధ్యలోనే దహన సంస్కారాలు నిర్వహించి సమాధి నిర్మించినట్లు తెలుస్తోంది. ఇది రామమందిరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో సరయు నది తీరం ఉంది. దీనిని బిల్వహరి ఘాట్ అంటారని స్థానికులు చెప్పారు. దశరథుడి పార్థివ దేహాన్ని దహనం చేసి ఆ చితాభస్మాన్ని సమాధిలో భద్రపరచారని వెల్లడించారు. ఇక్కడ దశరథుని సమాధితో పాటు రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుల పాద ముద్రలను తీర్చిదిద్దారు.