సంజయ్ పాదయాత్ర  100 కి.మీ. పూర్తి

సంజయ్ పాదయాత్ర  100 కి.మీ. పూర్తి
  • అవినీతి పాలనను అంతం చేస్తం
  • పదో రోజు ‘ప్రజా సంగ్రామ యాత్ర’లో బండి సంజయ్

బీజేపీ స్టేట్​ చీఫ్ ​బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ సోమరం వంద కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కార్యకర్తలు వంద కిలోల కేక్​ను సంజయ్​తో కట్ చేయించారు.

హైదరాబాద్, వెలుగు: అవినీతి, నియంతృత్వ పాలస సాగిస్తున్న సీఎం కేసీఆర్ ను గద్దె దింపడమే లక్ష్యంగా తన పాదయాత్ర కొనసాగుతుందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. టీఆర్​ఎస్ పాలనలో పేదలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. 2023లో రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, పేదల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మార్పు కనిపించేలా తన యాత్ర సాగుతోందని స్పష్టం చేశారు. 10 వ రోజు పాదయాత్రలో భాగంగా సోమవారం వికారాబాద్ జిల్లా మోమిన్ పేట నుంచి ప్రారంభమైన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ఒక కిలో మీటర్ కొనసాగిన తర్వాత వంద కిలో మీటర్లు పూర్తవడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వంద కిలోల కేక్ ను సంజయ్ చేత కట్ చేయించి పటాకులు కాల్చి, బెలూన్లు ఎగరేశారు. రోజంతా వర్షం కురిసినా పాదయాత్ర కొనసాగించారు. సదాశివపేటకు చేరిన యాత్రకు కార్యకర్తలు బోనాలు, 100 కాగడాలతో ఘనంగా స్వాగతం పలికారు. యాత్రలో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మహారాష్ట్ర మాజీ మంత్రి వినోద్ తావ్డే, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర మార్గంలో వివిధ వర్గాల ప్రజలతో సంజయ్ మాట్లాడారు. మేకవనంపల్లిలో రోడ్డు పక్కన గుడారాలు వేసుకొని నివసిస్తున్న సంచార జాతుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రాత్రి సదాశివపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

కేసీఆర్ రిటైర్డ్ పోలీసు అధికారులను లెఫ్ట్ రైట్ పెట్టుకొని పాలన చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య భేదాభిప్రాయాలు సృష్టించేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. పోలీసుల సమస్యలు పరిష్కారం కావాలంటే బీజేపీకి అండగా నిలువాలన్నారు. మా పార్టీ కార్యకర్తలంతా యూనిఫాం వేసుకోని పోలీసులేనన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన అందించే ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంతృత్వ పాలనతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు.
ఓటమి భయంతోనే హుజూరాబాద్ ఎన్నిక ఆపించిండు
ఓటమి భయంతోనే కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికను ఆపించిండని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. కేసీఆర్ కు మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చింది తెలంగాణపై ఉన్న ప్రేమ కొద్దేనని స్పష్టం చేశారు. 2016 లో కేసీఆర్ కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే.. కేంద్రం ప్రాజెక్టు డీపీఆర్ అడగడంతో మళ్లీ ఇప్పటిదాక ఆ మాట ఎత్తలేదని విమర్శించారు. కాళేశ్వరం లెక్కలు బయటకొస్తే కేసీఆర్, కేటీఆర్ జైలుకుపోవుడు ఖాయమని భావించి మోడీని జాతీయహోదా అడగడమే మరిచిపోయారని అన్నారు. శ్మశానానికి కాటికాపరి ఎట్లనో కాంగ్రెస్ కు పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి అట్ల తయారైండని మండిపడ్డారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్ట్రానికి మెతుకు పెట్టిన మెదక్ జిల్లాపై సీఎం కేసీఆర్ కు కన్నుకుట్టి మూడు ముక్కలు చేసిండని ధ్వజమెత్తారు. కొత్త జిల్లాలు వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్నాం.. కానీ కొత్తగా ఒక్క ఉద్యోగం రాలేదన్నారు. ఇక్కడి భూములు మనయని, ఇక్కడికి ఎన్నో కంపెనీలు వస్తున్నాయని, ఉద్యోగాలు మాత్రం పరాయి వాళ్లకు ఇస్తున్నారని ఆరోపించారు.