
జనగామ, వెలుగు: సిబిల్‌స్కోర్ నిబంధన లేకుండా రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులను ఎంపిక చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు దూడల సిద్ధయ్య, జనగామ పట్టణ అధ్యక్షుడు జాయ మల్లేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రవీందర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సిబిల్ స్కోర్‌తో సంబంధం లేదని చెప్పినా అధికారులు క్షేత్ర స్థాయిలో అందుకు అనుగుణంగా నడుచుకోవడం లేదన్నారు.
అప్లై చేసుకున్న వారి సిబిల్ స్కోర్లను బ్యాంకుల వద్దకు వెళ్లి అధికారులు ఎంక్వైరీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అర్హులకు పథకం వర్తింప జేయాలని, మధ్య దళారీ వ్యవస్థ లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎదునూరి రవీందర్, సలేంద్ర శ్రీనివాస్, గుజ్జుల మధు, దేవర సత్యనారాయణ, మేకల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.