యూరియా సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు

 యూరియా సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు

ధర్మసాగర్/ రాయపర్తి/ గూడూరు/ కొత్తగూడ, వెలుగు: యూరియా సరఫరాలు రైతులకు ఇబ్బందులకు గురి చేయొద్దని అధికారులు అన్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలో సొసైటీలను అధికారులు సందర్శించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువులు, యూరియా గోదామ్, మన గ్రోమోర్​ కేంద్రాన్ని కలెక్టర్​ స్నేహశబరీశ్​తనిఖీ చేశారు. వరంగల్​ జిల్లా రాయపర్తి పీఏసీఎస్, ప్రైవేట్​ ఫర్టిలైజర్​ షాపులను కలెక్టర్​ సత్యశారద పరిశీలించారు. అనంతరం మండలంలోని పెర్కవేడు, రాయపర్తి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ నిర్వహించారు. 

నేరుగా లబ్ధిదారుల అర్హతలు పరిశీలించారు. రాయపర్తి సంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో కిషోర ఆరోగ్య రక్ష శిబిరాన్ని పరిశీలించారు. మహబూబాబాద్​ గూడూరు సొసైటీ యూరియా గోదాంను ఎస్పీ రాంనాథ్​కేకన్​ తహసీల్దార్​ నాగభవానీతో కలిసి సందర్శించారు. మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి పీఏసీఎస్​ను మండల స్పెషల్​ ఆఫీసర్​ సురేశ్​ టాస్క్​ ఫోర్స్​ బృందంతో తనిఖీ చేశారు. అనంతరం రైతు వేదికలో మండల టాస్క్​ఫోర్స్​ఆఫీసర్లు, డీలర్లతో మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని ఆదేశించారు.