
మహాముత్తారం, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాల, కాటారం బాలుర, బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం బాలుర గిరిజన వసతి గృహాన్ని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూం, వంటగది, పారిశుధ్యం, అసంపూర్ణ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్, అసిస్టెంట్ పీవో క్షేత్రీయ తదితరులు పాల్గొన్నారు.