2 లక్షల ఖాళీలుంటే.. 50వేలు భర్తీ చేస్తామంటున్నారు

2 లక్షల ఖాళీలుంటే.. 50వేలు భర్తీ చేస్తామంటున్నారు
  • బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో లక్ష 96 వేల ఉద్యోగాలు ఉన్నాయని పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ లో పేర్కొంటే ప్రభుత్వం కేవలం 50 వేల పోస్ట్ లు భర్తీ చేస్తామనడం కంటితుడుపు చర్య మాత్రమే అవుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  ఆయన మాట్లాడుతూ 2 లక్షల ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏడు ఏళ్లు అవుతున్నా.. రాష్ట్రానికి అదనంగా 7 చుక్కల నీళ్లు అయినా వాటా కింద తీసుకురాలేదని విమర్శించారు. తెలంగాణ సాదించుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. తెలంగాణ వచ్చాక కూడా నీళ్ల లేవు.. నియామకాలు లేవు, నిధులు లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
తెలంగాణలో అన్ని పార్టీలు టీఆర్ఎస్ వశం
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీనే సరైన ప్రత్యామ్నాయమని.. ప్రస్తుతం అన్ని పార్టీలు టీఆర్ఎస్ వశం అయ్యాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ టీడీపీ మయం అయిందంటాడు, కోమటిరెడ్డి కాంగ్రెస్ టీడీపీ మయం అయిందని అంటున్నాడు, ఉన్న టీఆర్ఎస్  కాంగ్రెస్ మయం అయింది.. చివరకు అన్నీ టీఆర్ఎస్ వశం అయ్యాయని ఆయన ఆరోపించారు. 
తమ భూములెక్కడున్నాయో చూసుకునేందుకే షర్మిల పార్టీ
వైఎస్ జమానాలో తాము అక్రమంగా సంపాదించుకున్న భూములు ఎక్కడెక్కడున్నాయో చూసుకునేందుకే సిస్టర్ షర్మిల పార్టీ ఏర్పాటు చేసిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. వైఎస్ భారతి భయానికి తల్లీ కూతుళ్లు హైదరాబాద్ వచ్చి లోటస్ పాండ్ లో వాలిపోయారని ఆయన విమర్శించారు.  కేసీఆర్ కనుసన్నల్లో ఇక్కడ పార్టీ పెట్టిందని ఆయన పేర్కొన్నారు. తమ భూములెక్కడెక్కడున్నాయో వచ్చి చూసుకునే పరిస్థితి జగన్ కు లేకపోవడం వల్లే షర్మిల, విజయమ్మలు ఇక్కడకు రావడానికి కారణమని ఆయన పేర్కొన్నారు. తొలగించిన స్టాఫ్ నర్సు ల పరిస్థితిని ప్రస్తావిస్తూ.. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. 
ఎర్రబెల్లిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి: రాష్ట్ర కార్యదర్శి మాధవి చౌదరి 
మహిళా ఉద్యోగి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లిని సీఎం కేసీఆర్ వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవి చౌదరి డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎవరూ వాడని పదజాలాన్ని ఎర్రబెల్లి ప్రయోగించారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మంత్రులు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. ఎర్రబెల్లి తన ఇంట్లో మహిళ లతో అలానే మాట్లాడుతారా ? అని ఆమె  ప్రశ్నించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మంత్రి ఎర్రబెల్లి డబల్ మీనింగ్ డైలాగ్స్ మానుకోవాలని ఆమె సూచించారు.