Karnataka Polls : ప్రశాంతంగా ఓటింగ్ .. ఓటు వేసి మండపానికి వెళ్లిన పెళ్లికూతురు

Karnataka Polls : ప్రశాంతంగా ఓటింగ్ .. ఓటు వేసి మండపానికి వెళ్లిన పెళ్లికూతురు

కర్ణాటకలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.  ఓటర్లు  తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కాగా  9గంటల వరకు 9 శాతం పోలింగ్ నమోదైనట్టుగా  ఈసీ వెల్లడించింది. ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకున్న  వారిలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, కన్నడ నటుడు రమేష్ అర్వింద్, మాజీ సీఎం సదానంద గౌడ, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ లు ఉన్నారు.  ఓ నవ వధువు సైతం తన ఓటు హక్కును వినియోగించుకుని పెళ్లి మండపానికి వెళ్లింది.  

ఈ ఎన్నికలు యువ ఓటర్లకు గొప్ప అవకాశమని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు.  రాష్ట్రంలో ధరల పెరుగుదల, అవినీతి గురించి వారికి తెలుసనని, యువత మార్పు కోరుకుంటారని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 141 సీట్లు వస్తాయని తనకు 200% నమ్మకం ఉందన్నారు.  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  ది కేరళ స్టోరీ ప్రభావం కర్ణాటకలో ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు.  అటు ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని సీఎం బసవరాజ్ బొమ్మై  అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ను ఏర్పాటు చేస్తామని  ధీమా వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో మొత్తం 224 నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నుంచి 2,615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 2,430 మంది మేల్ క్యాండిడేట్స్, 184 మంది ఫీమేల్ క్యాండిడేట్స్, ఒకరు థర్డ్ జెండర్ క్యాండిడేట్ ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 5,31,33,054 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.