ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సంగారెడ్డి (హత్నూర)/సంగారెడ్డి టౌన్​, వెలుగు : అక్రమంగా ల్యాండ్ తీసుకొని డబుల్ బెడ్ రూమ్ కడుతున్నారనే మనస్థాపంతో సూసైడ్ చేసుకున్న నందీశ్వర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏవో కు వినతిపత్రం అందజేశారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్​గ్రేషియా, మృతుడి తండ్రి పేరు మీద ఉన్న ఎకరం భూమి సర్వే చేసి ఇవ్వాలని, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగయపల్లి గోపి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని  పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ విట్టల్, సీపీఎం నాయకులు జయరాజ్, మాల మహానాడు మండల అధ్యక్షుడు ఆంజనేయులు కమలాకర్ పాల్గొన్నారు.

రైతులకు రుణమాఫీ చేయని సర్కారును గద్దె దించాలి

మెదక్‌‌‌‌‌‌‌‌/సంగారెడ్డి టౌన్/సిద్దిపేటరూరల్, వెలుగు: రాష్ట్రంలో రైతులకు రుణ మాఫీ చేస్తామని హామీనిచ్చి మాట తప్పిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పలువురు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా నాయకులు మంగళవారం ఉమ్మడి మెదక్​జిల్లాలోని కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు. మెదక్‌‌‌‌‌‌‌‌ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, సంగారెడ్డిలో జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి సంగప్ప, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్  మాట్లాడారు. 2018 ఎన్నికలప్పుడు కేసీఆర్​రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని హామీనిచ్చి ఇప్పటికీ అమలు చేయలేదన్నారు.

ప్రభుత్వం మాఫీ చేస్తుందనే ఉద్దేశంతో రైతులు బ్యాంకుల్లో రుణాలు చెల్లించలేదని, దీంతో వడ్డీ ఒకటికి మూడింతలై భారంగా మారిందన్నారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయలేని సీఎం కేసీఆర్​ పంజాబ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలో రైతులకు లక్షలాది రూపాయలు పంపిణీ చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ధరణి పోర్టల్​అన్నదాతలను అవస్థలపాలు చేస్తోందన్నారు. జిల్లాలో వేలాది ఎకరాల భూములు పార్ట్‌‌‌‌‌‌‌‌(బీ)లో పెట్టడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.  వ్యవసాయాని 24 గంటల త్రీఫేజ్​ కరెంట్​ ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారని, కానీ వాస్తవానికి 12 గంటలు కూడా సరఫరా చేయడం లేదన్నారు. 

దళితుల నుంచి లాక్కున్న భూముల లెక్క చెప్పాలి.. : దుబ్బాక ఎమ్మెల్యే

బీజీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన రైతు ధర్నాలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల నుంచి లాక్కున్న అసైన్డ్ భూముల లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే నాయకులు రాష్ట్రంలో 8 ఏండ్లలో 8వేల మంది రైతులు ఎందుకు ఆత్మ హత్య చేసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మారుస్తానని చెప్పిన సీఎం కేసీఆర్​తాగుబోతుల తెలంగాణగా మార్చారని, అందుకు ఎక్సైజ్ శాఖ ఆదాయం 8 ఏండ్లలో రూ.8వేల కోట్ల నుంచి రూ.42వేల కోట్లకు పెరుగడమే నిదర్శనమన్నారు.

తనను కౌన్సిలర్ గా గెలువలేనని అంటున్న మెదక్​ ఎంపీ కొత్త కొత్త ప్రభాకర్ రెడ్డి దమ్ముంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని, బీఆర్ఎస్ బలమెంతో..  బీజేపీ బలమెంతో అప్పుడు తెలుస్తుందని సవాల్ ​విసిరారు. రవాణా శాఖా మంత్రి దుబ్బాక బస్టాండ్ ప్రారంభోత్సవానికి వచ్చే ముందు సిద్దిపేట బస్టాండ్ కు నిర్మాణానికి, దుబ్బాక బస్టాండ్ నిర్మాణానికి కేటాయించిన నిధులు ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. 

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తో నీటి సమస్య తీరింది

    మంత్రి తన్నీరు హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

జహీరాబాద్/కోహీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు తాగేందుకు నీళ్లు దొరకలేదని, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అధికారంలోకి వచ్చాకే నీటి సమస్యలు తీరాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్‌‌‌‌‌‌‌‌, కోహీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో తాగునీటి ఇబ్బంది పట్టించుకోలేదన్నారు. అప్పట్లో ఇల్లు రావాలంటే లంచం ఇవ్వాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఒక్క పైసా ఖర్చు లేకుండా అన్ని వసతులతో డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నట్లు చెప్పారు. జహీరాబాద్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలో రూ.156.32 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కోహీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.10 కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని వివరించారు. రెండు, మూడు నెలల్లో ఈ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. త్వరలో సంగమేశ్వర, బసవేశ్వర సాగునీరు ప్రాజెక్టులతో గోదావరి జలాలను  జహీరాబాద్‌‌‌‌‌‌‌‌కు తీసుకొస్తామని తెలిపారు. కార్యక్రమాలలో ఎంపీ బీబీ పాటిట్‌‌‌‌‌‌‌‌, రాష్ట్ర చేనేత సహకార సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే మాణిక్‌‌‌‌‌‌‌‌రావు, కలెక్టర్ శరత్, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ పాల్గొన్నారు. 

వైద్య విద్యా కోర్సులు మంజూరు

సిద్దిపేట రూరల్: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న బీఎస్సీ పారామెడికల్‌‌‌‌‌‌‌‌లో  వైద్య విద్యా కోర్సులు మంజూరైనట్లు మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు పారామెడికల్ కోర్సులు 50 సీట్లతో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.

అర్హులకే డబుల్ ​బెడ్​ రూమ్​ ఇండ్లు ఇవ్వాలి

    మున్సిపల్​ ఆఫీస్ ​ఎదుట లబ్ధిదారుల ధర్నా 

కోహెడ(హుస్నాబాద్), వెలుగు : అర్హులకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్​ చేస్తూ అఖిల పక్షం నాయకులతో కలిసి లబ్ధిదారులతో మంగళవారం హుస్నాబాద్ ​మున్సిపల్​ఆఫీస్​ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో అనర్హులను ఎంపిక చేశారని ఆరోపించారు. సర్వేలో జరిగిన అవకతవకలపై మరోసారి రీ సర్వే చేయించాలని డిమాండ్​ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల జాబితాపై ఫిర్యాదుల స్వీకరణ గడువు మరో 10 రోజులు పెంచాలని కోరారు. పేదలకు న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్​ రెడ్డి, మల్లికార్జున్​ రెడ్డి, రవీందర్  తదితరులు పాల్గొన్నారు.

పాలిటెక్నిక్ కాలేజ్ కు నష్టం కలుగకుండా సర్వే చేయండి

    ‘సిద్దిపేట రింగు రోడ్డు’పై ఆఫీసర్లకు కలెక్టర్​ ఆదేశం

సిద్దిపేట రూరల్, వెలుగు : తోర్నాల పాలిటెక్నిక్ కాలేజ్ కు నష్టం కలుగకుండా సిద్దిపేట రింగ్ రోడ్డు(ఎస్​ఆర్​ఆర్) పనుల సర్వే చేయాలని సంబంధిత ఆఫీసర్లకు సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామ పరిధిలోని  ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్  ప్రాంతాన్ని ఆయన  పరిశీలించారు. ఈ సందర్భంగా కాలేజ్  ప్రిన్సిపాల్ శ్రీదేవి విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిలో నుంచి ఎస్ఆర్ఆర్​ వెళ్తోందని, దాంతో కాలేజ్ కు చాలా విభాగాల్లో నష్టం కలుగుతుందని కలెక్టర్ కు వివరించారు. ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ అధికారులు రోడ్డు వెళ్తున్న క్రమాన్ని మ్యాప్ ద్వారా కలెక్టర్ కు చూపించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఆర్ఆర్ మార్గాన్ని కాలేజ్ మధ్యలో కాకుండా చివరి నుంచి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఆర్ అండ్ బీ ఈఈ సుదర్శన్ రెడ్డి, డీఈ బాల ప్రసాద్, వైస్ ఎంపీపీ శేరుపల్లి యాదగిరి, సర్పంచ్ దేవయ్య ఉన్నారు. 

‘మన ఊరు మన బడి’ పనుల్లో వేగం పెంచండి

హుస్నాబాద్ నియోజకవర్గంలో మన ఊరు మన బడి పనులు నత్తనడకన సాగుతున్నాయని, పనుల్లో వేగం పెంచాలని సంబంధిత ఆఫీసర్లను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గం, బెజ్జంకి మండలంలోని పనులపై ఆయన సమీక్షించి పలు సూచనలు చేశారు. సమావేశంలో డీఆర్డీఏ, డీఈఓ, తదితరులు ఉన్నారు. 
 

ప్రజా సంక్షేమాన్ని మరిచిన పాలకులు

    సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంట్​ రెడ్డి

కోహెడ(హుస్నాబాద్​), వెలుగు: ప్రజలకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన పాలకులు ప్రజా సంక్షేమాన్ని మరిచారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​ రెడ్డి విమర్శించారు. మంగళవారం హుస్నాబాద్​ పట్టణంలో ‘ఇంటింటికీ సీపీఐ’ అనే నినాదంతో వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మందికి నివాస స్థలాలు ఇప్పించినట్లు గుర్తు చేశారు. ఇప్పటికీ16 ఏళ్లు గడిచినా వారికి పక్క ఇండ్లు ఇవ్వకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్​అధికారంలోకి వచ్చాక డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు ఇస్తానని చెప్పి మాట మార్చారన్నారు. సొంత జాగలో ఇండ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుంటే కేసీఆర్​ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు గడిపే మల్లేశ్, శ్రీనివాస్, వనేశ్ తదితరులు ఉన్నారు.

విహార యాత్రలో విషాదం..

  •     కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో కొల్చారం 
  •     జడ్పీ హైస్కూల్ స్టూడెంట్​ మృతి
  •     కాలువలో జారి పడి 
  •      చనిపోయిన ఎస్సెస్సీ విద్యార్థి

మెదక్​ (కొల్చారం), వెలుగు : విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కొల్చారం జడ్పీ హైస్కూల్​ స్టూడెంట్​కర్నాటక రాష్ట్రం బళ్లారిలో ప్రమాదవశాత్తు చనిపోయాడు. కొల్చారం హైస్కూల్​కు చెందిన 52 మంది విద్యార్థులు, 8 మంది టీచర్లు ఈనెల 23న విహారయాత్ర కోసం టూరిస్ట్​ బస్​లో కర్నాటక వెళ్లారు. 24, 25, 26 తేదీల్లో వివిధ ప్రాంతాలను సందర్శించారు. మంగళవారం ఉదయం బళ్లారి సమీపంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన 10వ తరగతి స్టూడెంట్ పి.రాకేశ్​(16) ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడి మరణించాడు. మృతుడు అప్పాజిపల్లి గ్రామానికి చెందిన ఆగమయ్య కొడుకు. దీంతో అప్పాజిపల్లి, కొల్చారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాకేశ్​మృతదేహానికి బళ్లారి హాస్పిటల్​ లో పోస్ట్​మార్టం పూర్తి చేసి అప్పాజిపల్లికి తీసుకురానున్నారు. 

హెచ్ఎంపై చర్యలు : డీఈఓ

విహార యాత్రలో స్టూడెంట్ మృతి చెందిన నేపథ్యంలో డీఈఓ రమేశ్ కుమార్, ఎంఈఓ నీలకంఠం మంగళవారం కొల్చారం జడ్పీ హైస్కూల్​కు వచ్చారు. డీఈఓ మాట్లాడుతూ కొల్చారం జడ్పీ హైస్కూల్​ స్టూడెంట్స్ విహార యాత్రకు వెళ్లేందుకు పర్మిషన్​ తీసుకోలేదని చెప్పారు. అనుమతి లేకుండా స్టూడెంట్స్​ను విహారయాత్రకు పంపి, ఒకరి మృతికి కారకుడైన హెచ్ఎంపై చర్యలు తీసుకుంటామన్నారు.  
 

ఫుడ్ బాగలేదని స్తూన్​పూర్​

  • ‘జేఎన్టీయూ’ స్టూడెంట్స్​ ఆందోళన 
  • కాలేజ్​ను సందర్శించిన ఆర్డీవో 

పుల్కల్, వెలుగు : సంగారెడ్డి జిల్లా చౌటకూర్​మండలంలోని సుల్తాన్​పూర్ జేఎన్​టీయూ ఇంజనీరింగ్ కాలేజ్​ హాస్టల్​లో ఫుడ్​ బాగుండటం లేదని, ప్రిన్సిపాల్​దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని సోమవారం రాత్రి కాలేజ్ మెయిన్​ గేట్​వద్ద స్టూడెంట్స్​ ఆందోళనకు దిగారు.  ప్రతినెలా తమ వద్ద  మెస్​చార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ మంచి భోజనం పెట్టాడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయని ఆరోపించారు. ఆందోళన విషయం తెలుసుకున్న  జోగిపేట ఆర్డీవో అంబదాస్​రాజేశ్వర్ మంగళవారం కాలేజ్​ను సందర్శించారు. ప్రిన్సిపాల్ నరసింహతో మాట్లాడారు.  భోజనం కలుషితమైనట్లు తెలితే చర్యలు తీసుకుంటామని మెస్​ కాంట్రాక్టర్​ను హెచ్చరించారు. స్టూడెంట్స్​సమస్యలపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. 

ఎన్ఎస్​యూఐ మద్దతు..

యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్​ నాయకులు కార్యకర్తలు హాస్టల్​ను సందర్శించారు. స్టూడెంట్స్​కు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్​ చేశారు.