వనపర్తి జిల్లాలో లిఫ్ట్ లను పట్టించుకోలే .. మూలకుపడ్డ ఎత్తిపోతల పథకాలు

వనపర్తి జిల్లాలో లిఫ్ట్ లను పట్టించుకోలే  .. మూలకుపడ్డ ఎత్తిపోతల పథకాలు
  • యాసంగికి తప్పని సాగు నీటి కష్టాలు, తగ్గనున్న సాగు విస్తీర్ణం

వనపర్తి, వెలుగు: కాంగ్రెస్​ హయాంలో వనపర్తి జిల్లాలోని నీటి వనరులను పంట పొలాలకు మళ్లించేందుకు నిర్మించిన ఎత్తిపోతల పథకాలను గత బీఆర్ఎస్​ సర్కారు పట్టించుకోకపోవడంతో జిల్లా రైతాంగం సాగునీటి కష్టాలు ఎదుర్కొంటోంది. చిన్నపాటి రిపేర్లు సైతం చేపట్టకపోవడంతో లిఫ్ట్​లు వృథాగా మారాయి. దీంతో ఈ యాసంగిలో రైతులు పంటలు వేసుకోకుండా క్రాప్ హాలిడే ప్రకటించారు. గత కాంగ్రెస్  ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు ఎత్తిపోతల పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రైతులు ఆరోపిస్తున్నారు.

వివిధ స్కీముల పేరుతో రూ.లక్షల కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం, వనపర్తి జిల్లాలోని లిఫ్ట్​లకు మెయిటెనెన్స్  ఫండ్స్​ మంజూరు చేయకపోవడంతో మూలకుపడ్డాయి. లిఫ్ట్ లు పని చేయకపోవడంతో సాగునీటి కోసం రైతులు బోర్లు వేసుకుంటుండగా నీళ్లు పడకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. నీళ్లు లేక పంటలు పండక, బోర్లు వేసి అప్పుల పాలైన రైతులు లిఫ్ట్ లకు రిపేర్లు చేయాలని బీఆర్ఎస్  ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి రావడంతో పాత లిఫ్ట్ లకు మళ్లీ ప్రాణం పోస్తారని రైతులు ఆశలు పెట్టుకున్నారు. 

నెల్విడి లిఫ్ట్ నిధులు వృథా..

మదనాపురం మండలంలోని రామన్ పాడు రిజర్వాయర్ పై 2006లో అప్పటి కాంగ్రెస్  ప్రభుత్వం రూ.11 కోట్లతో నిర్మించిన నెల్విడి ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్  సమయంలోనే ఫెయిల్  కావడంతో రైతులకు నీరందించడం లేదు. ఆ తరువాత మరో రూ.4 కోట్లు మంజూరు చేసి రిపేర్లు చేసినా లాభం లేకుండా పోయింది. కాంట్రాక్టర్  నాసిరకం సిమెంట్ పైపులు, మోటార్లు వాడడంతో ట్రయల్  రన్ లోనే 150 కి పైగా లీకేజీలు ఏర్పడ్డాయి.

ఆ తరువాత పలుమార్లు రిపేర్లు చేసినా లాభం లేకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. సాగునీటి సంఘానికి ఈ స్కీమ్​ను అప్పగించి కాంట్రాక్టర్​కు బిల్లు మొత్తం చెల్లించారు. ఆ తరువాత బీఆర్ఎస్  ప్రభుత్వం మళ్లీ అదే కాంట్రాక్టర్ కు రూ.4 కోట్ల రిపేర్​ పనులను అప్పగించింది. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.

దీంతో మదనాపురం మండలంలోని నెల్విడి, నరసింగాపురం, కొన్నూరు, ద్వారకనగరంతో పాటు మరో రెండు తండాల్లోని 3,100 ఎకరాలకు నీరందని పరిస్థితి ఉంది. సాగు నీరందక ఈ భూములు బీడుగా మారాయి. గతంలోఎత్తిపోతల పథకాలు ఐడీసీ పరిధిలో ఉండేవి. గత ప్రభుత్వం సాగునీటి పథకాలన్నింటినీ ఒకే గొడుగు కింద చేర్చి ఇరిగేషన్  శాఖకు అప్పగించింది. దీంతో చిన్న ఎత్తిపోతల పథకాలను పట్టించుకోలేదు. 

శంకరసముద్రం లిఫ్ట్​దీ అదే పరిస్థితి.. 

కొత్తకోట మండలంలోని శంకర సముద్రం ఫేస్ 1, ఫేస్ 2 పథకాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. వీటి పరిధిలో భీమా లిఫ్ట్  నీరు అందుతుండడంతో వీటిని అధికారులు మూసేశారు. ఈ రెండు పథకాలకు చిన్నపాటి మార్పులు చేస్తే కొత్తకోట మండలంలోని కొత్తకోట, వడ్డేవాట, తిరుమలయ్యపల్లి, దంతనూరు, చెర్లపల్లి, అమడబాకుల, సుంకిరెడ్డిపల్లి గ్రామాలకు సాగునీరు అందించే అవకాశాలున్నాయి.

అలాగే చిన్నంబావి మండలంలోని చిన్నమారూర్  లిఫ్ట్​ కింద 10 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, ఈ పథకం నిరుపయోగంగా మారింది. మండలంలోని చెల్లెపాడు లిఫ్ట్  ద్వారా చెల్లెపాడు, కాలూరు, అయ్యవారిపల్లె గ్రామాల్లోని 7,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నా అదీ పని చేయడం లేదు.1994లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించారు.