కేంద్ర ఉద్యోగులకు 4 శాతం డీఏ.. రైల్వే ఎంప్లాయ్స్ కు 78 రోజుల జీతం బోనస్

కేంద్ర ఉద్యోగులకు 4 శాతం డీఏ.. రైల్వే ఎంప్లాయ్స్ కు 78 రోజుల జీతం బోనస్
  • గోధుమలకు ఎంఎస్పీ రూ.150 పెంపు 
  • మరో ఐదు పంటలకు కూడా..కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం

న్యూఢిల్లీ : దసరా సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైతులకు ఎన్డీయే సర్కార్ గిఫ్ట్ ఇచ్చింది. కేంద్ర ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ పెంచడంతో పాటు రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. ఆరు పంటలకు మద్దతు ధరను పెంచింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. మీటింగ్ అనంతరం కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ ను 4 శాతం చొప్పున పెంచి 46 శాతం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. 7వ సెంట్రల్ పే కమిషన్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇది ఈ ఏడాది జులై 1 నుంచే వర్తిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఏటా రూ.12,857 కోట్ల భారం పడుతుందన్నారు. 

20 వేల కోట్లతో కరెంట్ లైన్.. 

రైల్వేలో పనిచేస్తున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. ఒక్కో ఉద్యోగికి 78 రోజుల జీతాన్ని బోనస్​గా ఇవ్వనున్నట్టు అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ‘‘ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్ బీ)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వేలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల జీతాన్ని బోనస్ గా ఇస్తాం. దీంతో 11.07 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఇందుకు రూ.1,968.87 కోట్లు ఖర్చవుతుంది” అని తెలిపారు.

 2022–23లో రైల్వే ఉద్యోగులు అద్భుతంగా పని చేశారని ప్రశంసించారు. కేంద్ర నిర్ణయంతో ట్రాక్ మెయింటెనర్స్, లోకో పైలెట్లు, గార్డ్స్, స్టేషన్ మాస్టర్లు, సూపర్ వైజర్లు, టెక్నీషియన్స్,  పాయింట్స్ మెన్ తదితర గ్రూప్ సీ స్టాఫ్ కు ప్రయోజనం చేకూరనుంది. కాగా, లడఖ్ లో ఏర్పాటు చేయనున్న 13 గిగావాట్ల మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు నుంచి కరెంట్​ను తరలించేందుకు ట్రాన్స్ మిషన్ లైన్​కు కేబినెట్ ఆమోదం తెలిపిందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇందుకు 
రూ.20,773.7 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు.

గోధుమ సహా ఆరు పంటలకు మద్దతు ధర పెంపు.. 

గోధుమ సహా 6 పంటలకు మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. 2024–25 మార్కెటింగ్ సీజన్ కు గాను కొత్త ధరలను నిర్ణయించింది. గోధుమలపై క్వింటాల్ కు రూ.150 చొప్పున పెంచగా ఎంఎస్పీ రూ.2,275కు చేరింది. బార్లీకి రూ.115 పెంచగా ఎంఎస్పీ రూ.1,850.. శనగలపై రూ.105 పెంచగా రూ.5,440.. కందులపై రూ.425 పెంచగా రూ.6,425.. ఆవాలపై రూ.200 పెంచగా రూ.5,650.. సన్ ఫ్లవర్ పై రూ.150 పెంచగా ఎంఎస్పీ రూ.5,800 అయింది. ఎన్డీయే సర్కార్  అధికారంలోకి వచ్చాక గోధుమలకు ఈ స్థాయిలో మద్దతు ధర పెంచడం ఇదేమొదటిసారి.