ఉచిత విద్య కోసం పోరాడాలి : ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ

ఉచిత విద్య కోసం పోరాడాలి : ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ
  • సెంట్రల్  యూనివర్సిటీ  ప్రొఫెసర్​ లక్ష్మీనారాయణ

వనపర్తి, వెలుగు: ఉచిత విద్య కోసం జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే స్ఫూర్తితో పోరాడాలని సెంట్రల్  యూనివర్సిటీ ప్రొఫెసర్​ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. వనపర్తిలోని ఓ ఫంక్షన్  హాల్​లో  పీడీఎస్​యూ 4వ రాష్ట్ర మహాసభ బుధవారం రెండో రోజు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకట్ రెడ్డి ప్రతినిధుల మహాసభను ప్రారంభించారు. విద్యా గోష్టి లో భాగంగా ‘నూతన జాతీయ విద్యా విధానం-,- శాస్త్రీయ విద్య మధ్య వైరుధ్యాలు’ అనే అంశంపై లక్ష్మీనారాయణ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, సంఘ్​ పరివార్  శక్తులు కలిసి నూతన జాతీయ విద్యా విధానాన్ని మూడు భాగాలుగా విభజించారని తెలిపారు. 

విద్యను వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ చేయడం, విద్యలో మతపరమైన అంశాలను చేర్చడం, విద్యపై కేంద్రం పెత్తనం చేయడం వంటి మూడు ప్రధాన అంశాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. రెండో సెషన్ లో  పీడీఎస్​యూ చరిత్ర, 50 ఏళ్లలో నిర్వహించిన పోరాట క్రమాన్ని, విద్యార్థుల త్యాగాలపై సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి, ప్రముఖ కవి జనజ్వాల వివరించారు. రాఘవాచారి, విజయ్  కన్నా, ఎండీ రఫీ, ఎస్  కిరణ్ కుమార్, బి భాస్కర్, పవన్ కుమార్, రంజిత్, సతీశ్,  జె. గణేశ్, సైదులు, అర్జున్, వంశీ రాజు, ప్రశాంత్  పాల్గొన్నారు.