ఛత్తీస్‌ఘడ్‌లో ఇండ్ల దగ్గరే ఇంటర్ పరీక్ష

ఛత్తీస్‌ఘడ్‌లో ఇండ్ల దగ్గరే ఇంటర్ పరీక్ష
  • కరోనా నేపధ్యంలో ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం
  • పరీక్షా కేంద్రం నుంచి ప్రశ్నాపత్రం తీసుకెళ్లి ఇంట్లో పరీక్ష రాసి 5 రోజుల్లోగా ఆన్సర్ షీట్ ఇవ్వాలి
  • జూన్ 1 నుంచి 5 వరకు ప్రశ్నాపత్రం తీసుకెళ్లేందుకు అవకాశం
  • 1వ తేదీన తీసుకెళ్లిన వారు 5వ తేదీన, 5న తీసుకెళ్లినవారు 10లోగా ఆన్సర్ షీట్లు తిరిగిచ్చేయాలి
  • గడువులోగా ఆన్సర్ షీట్లు తిరిగివ్వకపోతే ఆబ్సెంట్ గా పరిగణిస్తాం: ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.కె.గోయల్

ఇంటర్మీడియట్ పరీక్షలపై ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న తరహాలో ఇంటర్‌ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. కరోనా నేపధ్యంలో ఇంటర్ పరీక్షలను విద్యార్థులు ఇళ్ల వద్దే రాసే అవకాశం కల్పించింది. విద్యార్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రం నుంచి ప్రశ్నాపత్రం తీసుకెళ్లి విద్యార్థులు ఇంటి దగ్గరే ఎగ్జామ్‌ రాయొచ్చు. ఎగ్జామ్ రాశాక ఐదు రోజుల్లోగా ఆన్సర్ షీట్లు తిరిగిచ్చేయాల్సి ఉంటుంది. 
ఛత్తీస్‌ఘడ్‌ లో జూన్ 1 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ నేపధ్యంలో వినూత్న తరహాలో విద్యార్థులు ప్రశ్నాపత్రం తీసుకెళ్లి ఇండ్ల వద్దే రాసి తిరిగిచ్చేలా కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. జూన్ 1న తొలిరోజే అందరూ ఎగబడకుండా కట్టడి చేసేందుకు 1 నుంచి 5వ తేదీలోపు వీలు చూసుకుని ఎప్పుడైనా తీసుకెళ్లే అవకాశం కల్పించారు. అలాగే తీసుకెళ్లిన రోజు నుంచి 5 రోజుల్లోగా జవాబు పత్రాలను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా అంటే 5 రోజుల్లోగా తిరిగివ్వకపోతే ఆబ్సెంట్ గా పరిగణిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.కె.గోయల్ వెల్లడించారు. సివిజిఎస్‌ఇ కార్యదర్శి వి కె గోయల్ శనివారం సాయంత్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, కోవిడ్ -19 మహమ్మారి మరియు రాష్ట్రవ్యాప్తంగా 2.86 లక్షల మంది విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. పూర్తి విధి విధానాలను ఇవాళ లేదా రేపు వెల్లడించే అవకాశం ఉంది. చత్తీస్‌ఘడ్‌లోకి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనం రేపుతోంది. దేశ వ్యాప్తంగా జరిగే సీబీఎస్‌ఈ పరీక్షలు ఏ పద్ధతిలో ఎలా నిర్వహిస్తారన్నది ఇవాళ సాయంత్రం నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.