అంతరిక్షం నుంచి భూమికి కరెంట్

అంతరిక్షం నుంచి భూమికి కరెంట్
  • 2028లో ట్రయల్స్ చేపట్టనున్న చైనా
  • 33 ఎకరాల్లో టెస్టింగ్ ఫీల్డ్ ను నిర్మిస్తున్న డ్రాగన్ 
  • అమెరికా, బ్రిటన్ కన్నా ముందే టార్గెట్ చేరేందుకు ప్లాన్

బీజింగ్: సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీని అంతరిక్షంలోనే ఒడిసిపట్టి కరెంట్ తయారు చేయడం.. స్పేస్ లో అవసరాలకు సరిపోను మిగిలిన కరెంట్ ను భూమికి బీమ్స్ రూపంలో తీసుకురావడం అన్నది ఎప్పటి నుంచో ఉన్న ‘స్పేస్ సోలార్ పవర్’ కాన్సెప్ట్. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు బ్రిటన్, అమెరికా ఇదివరకే ప్లాన్ లు కూడా సిద్ధం చేసుకున్నాయి. అయితే, ఆ రెండు దేశాల కంటే ముందే ప్లాన్ ను అమలు చేసి, ప్రపంచంలోనే తొలి స్పేస్ సోలార్ ప్లాంట్ ను ప్రారంభించే దిశగా చైనా వేగంగా చర్యలు తీసుకుంటోంది. అనుకున్న దాని కంటే రెండేండ్లు ముందుగానే 2028 నాటికి స్పేస్ సోలార్ ప్లాంట్ ను సిద్ధం చేసి ట్రయల్స్ చేపట్టేందుకు డ్రాగన్ కసరత్తు షురూ చేసింది. ఇందుకోసం భూమిపై ఒక టెస్టింగ్ ఫీల్డ్ ను కూడా నిర్మిస్తున్నట్లు ఇటీవల చైనా అధికారులు వెల్లడించారు.

2014లో షురూ.. 

చైనా 2014లో ఒమెగా (ఆర్బ్ షేప్ మెంబ్రేన్ ఎనర్జీ గ్యాదరింగ్ అర్రే) పేరుతో స్పేస్ సోలార్ ప్లాంట్ ప్రాజెక్టును మొదలుపెట్టింది. షిడియాన్ యూనివర్సిటీ సైంటిస్టులు దీనిపై రీసెర్చ్ చేస్తున్నారు. స్పేస్ లో 10 కిలోవాట్ల కెపాసిటీ గల ‘ఒమెగా’ సోలార్ ప్లాంట్ ఏర్పాటు దీని లక్ష్యం. అంతరిక్షంలో ఐదు భారీ సోలార్ పవర్ అర్రేలతో 75 మీటర్ల ఎత్తు ఉండేలా ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. స్పేస్ లో సోలార్ కరెంట్ ఉత్పత్తి ప్రారంభించాక తొలిదశలో శాటిలైట్లకు దానిని వాడుకోవడంపై దృష్టిపెడతారు. ఆ తర్వాత ఫైనల్ గా కరెంట్ ను భూమికి వైర్ లెస్ గా పంపడంపై ఫోకస్ చేయనున్నారు.

సేఫా? కాదా?.. ట్రయల్స్ ​లోనే తేల్తది

అంతరిక్షంలో సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీని నేరుగా ఒడిసిపట్టేలా భారీ సోలార్ ప్యానెల్స్ తో కూడిన సోలార్ స్పేస్ స్టేషన్ ను చైనా నిర్మించనుంది. ఇది సోలార్ ఎనర్జీని కరెంట్ గా, మైక్రోవేవ్స్ గా మారుస్తుంది. ఇందులో కొంత పవర్ ను శాటిలైట్లకు వాడుకుంటారు. మిగతా కరెంట్ ను ఎనర్జీ బీమ్స్ రూపంలో నేరుగా భూమిపై కొన్ని ఫిక్స్డ్ లొకేషన్లలో ఉండే పవర్ రిసీవింగ్ సెంటర్లకు పంపుతారు. అంటే.. అంతరిక్షం నుంచి భూమికి వైర్ లెస్ రూపంలో కరెంట్ వస్తుంది. ఇందుకోసం చోంగ్ క్వింగ్ టౌన్ సమీపంలోని బిషన్ ఏరియాలో 33 ఎకరాల టెస్టింగ్ ఫెసిలిటీని చైనా నిర్మిస్తోంది. అయితే, ఇది అనుకున్నంత ఈజీగా అవుతుందా? దీనివల్ల భూమిపై ప్రాణులకు ఏమైనా ముప్పు ఉంటుందా? లేదా? అన్నవి ట్రయల్స్ జరిగిన తర్వాతే తేలుతాయి.