బెంగళూరు ప్రైవేట్ స్కూల్ హాస్టల్ : ర్యాగింగ్ పేరుతో టెన్త్ విద్యార్థిపై ఇంటర్ స్టూడెంట్స్ లైంగిక దాడి

బెంగళూరు ప్రైవేట్ స్కూల్ హాస్టల్ : ర్యాగింగ్ పేరుతో టెన్త్ విద్యార్థిపై ఇంటర్ స్టూడెంట్స్ లైంగిక దాడి

ఎన్ని చర్యలు తీసుకుంటున్న కూడా ర్యాగింగ్ ఇంకా విద్యార్థులను వెంటాడుతూనే ఉంది. డిగ్రీ, బిటెక్ కాలేజెస్ నుండి ఇప్పుడు ఇంటర్ వరకు ఈ ర్యాగింగ్ భూతం వ్యాపించింది. బెంగళూరులో ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్ వార్డెన్‌ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసారు. స్కూల్లో చదువుతున్న 10వ తరగతి బాలుడిపై ఇంటర్  విద్యార్థులు లైంగికంగా వేధించి, ర్యాగింగ్‌ చేసారని తెలియడంతో పోలీసులు వార్డెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కంప్లైంట్లో హాస్టల్ వార్డెన్ ర్యాగింగ్, వేధింపులను ప్రోత్సహిస్తున్నడని  కూడా పేర్కొన్నాడు.

సమాచారం ప్రకారం ఈ సంఘటన స్కూల్ హాస్టల్లో జరిగిందని, వార్డెన్ ర్యాగింగ్ ప్రోత్సహిస్తున్నడని, దీని గురించి ప్రిన్సిపాల్‌కు చెప్పిన కూడా ఎటువంటి చర్య తీసుకోలేదని బాలుడు ఆరోపించాడు.

విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు ప్రకారం సెప్టెంబర్ 3న తన కొడుకును ర్యాగింగ్ పేరుతో నగ్నంగా డ్యాన్స్ చేయమని బలవంతం చేశారని, చేయకపోతే స్టీల్ హ్యాంగర్లతో సహా ఇతర వస్తువులతో దాడి చేశారని చెప్పారు. ఇది ఇక్కడితో ఆగకుండా, సెప్టెంబర్ 4, 5, 6న కూడా బాలుడిపై రాత్రుల్లో లైంగిగ దాడి జరిగిందని తెలిపారు. 

విద్యార్థి తల్లిదండ్రుల ఆరోపణల ఆధారంగా లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత విభాగాల కింద కేసు నమోదు చేసుకొని, హాస్టల్ వార్డెన్‌ను అరెస్టు చేసి, దీని పై పూర్తి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఇదే నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని మోరంపూడి జిల్లాలో జరిగిన మరో సంఘటనలో  శ్రీ చైతన్య హాస్టల్‌లో 10వ తరగతి విద్యార్ధుడిని తోటి హాస్టల్ విద్యార్ధులు ర్యాగింగ్ చేసి దాడి చేశారు. ఈ విషయం ఎవరికైన చెబితే చంపేస్తామని బెదిరించారని కూడా చెప్పాడు.