
- చంద్రబాబు, పవన్‌కు అభినందనలు
- ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 8 స్థానాల్లో గెలుపు కార్యకర్తల విజయమేనని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ100 రోజుల పాలనను ఆశీర్వదిస్తూ 8 ఎంపీ సీట్లతోపాటు కంటోన్మెంట్ శాసన సభ ఉప ఎన్నికలో విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. ప్రజలు అందించిన ఆశీర్వాదాలు తమ ఆత్మస్థైర్యాన్ని పెంచాయని, మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు ఉత్సాహాన్నిచ్చాయని మంగళవారం రిలీజ్ చేసిన ఒక ప్రకటలో రేవంత్ పేర్కొన్నారు.
ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉన్నదన్న విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయని చెప్పారు. కాంగ్రెస్ విజయం కోసం పని చేసిన కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల శ్రమను పార్టీ గుర్తిస్తుందని చెప్పారు. ఇక ఎన్నికల కోడ్ ముగుస్తోందని, మళ్లీ ప్రజా ప్రభుత్వ పాలన మొదలవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అద్భుతమైన పాలన అందిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ప్రజా పాలన ఉంటుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
చంద్రబాబు, పవన్‌కు అభినందనలు
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ, సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదామని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు పెట్టారు.