వైద్య ప్రమాణాల్లో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

వైద్య ప్రమాణాల్లో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో  ప్రసవాలపై సమీక్ష

ఖమ్మం టౌన్, వెలుగు : వైద్య ప్రమాణాలలో ఖమ్మం జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హల్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక సంస్థల అడిషనల్​కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి మంగళవారం వైద్య శాఖ అధికారులతో సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలపై సమీక్షించారు.  నెల రోజులపాటు ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేశానని, డాక్టర్లు, సిబ్బంది మరింత మెరుగ్గా సేవలు అందించాలని అన్నారు.   ఆగస్టు 1 నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే సిబ్బంది అటెండెన్స్ ఆన్ లైన్ లో నమోదు కావాలని ఆదేశించారు. ఏఎన్ఎం పని తీరు, ఫీవర్ సర్వే, ఏఎన్ సీ రిజిస్ట్రేషన్ లాంటి పలు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

 అవసరమైన వ్యాధి నిర్ధారణ కిట్లు అందుబాటులో పెట్టాలన్నారు. డెంగ్యూ కేసుల నమోదు దాచొద్దన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని, ప్రసవాల సంఖ్యపెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రస్తుతం సబ్ సెంటర్ లో ప్రాథమికంగా టీబీ నిర్ధారణ పరీక్షలు జరగాలన్నారు. అడిషనల్​ కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ ఆస్పత్రి వద్ద అందుబాటులో ఉన్న వ్యాధి నిర్ధారణ కిట్లు, ఇంకా అవసరమైన కిట్ల వివరాలతో ప్రతిపాదనలు అందించాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లకు డిప్యూటేషన్ రద్దు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో  జడ్పీ సీఈవో దీక్షా రైనా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళావతి బాయి, జడ్పీ డిప్యూటీ సీఈవో నాగపద్మజ, ఆస్పత్రి సూపరింటెండెంట్ లు పాల్గొన్నారు. 

ఇందిరమ్మ ఇండ్లను వేగంగా పూర్తి చేయాలి

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణం త్వరగా పూర్తి  చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్ లో మంగళవారం ఆయన ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్న ఇండ్లకు వివిధ దశలను అనుసరిస్తూ వెంటవెంటనే డబ్బులను ఖాతాలో జమ చేయిస్తామని చెప్పారు. మంజూరు చేసిన ఇండ్లు గ్రౌండ్ అయ్యే విధంగా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. 

మొక్కలు పెంచాలి.. 

భావితరాలకు పచ్చదనం ఇచ్చే మొక్కలు పెంచే వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ అనుదీప్ సూచించారు. రఘునాథపాలెం మండలం జింకల తండా గుట్ట వద్ద వన మహోత్సవం, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమలుకోసం మెగా బ్లాక్ ప్లాంటేషన్ కు అనువైన స్ధలాన్ని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. స్థలాన్ని ఎర్రమట్టితో చదునుచేసి మంత్రులతో, వీఐపీలతో మొక్కలు నాటే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.