
కల్వకుర్తి, వెలుగు : విద్యార్థులు సాంకేతిక నైపుణ్యం పెంచుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని ఐటీఐ కళాశాలలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతిక విద్య ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి పొందవచ్చునని తెలిపారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను చేరువ చేస్తున్నాయన్నారు.
అనంతరం ప్రస్తుతం ఏటీసీలో విద్యార్థుల సంఖ్య, అందిస్తున్న కోర్సుల వివరాలను ప్రిన్సిపాల్ జయమ్మను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ల్యాబ్ పరికరాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కల్వకుర్తి, వెల్దండ ఎమ్మార్వోలు ఇబ్రహీం, కార్తీక్ కుమార్ ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.