అర్హులైన గిరిజనులకు పట్టాలు అందిస్తాం : కలెక్టర్ కుమార్ దీపక్

అర్హులైన గిరిజనులకు పట్టాలు అందిస్తాం : కలెక్టర్ కుమార్ దీపక్
  • కలెక్టర్ కుమార్ దీపక్ 

దండేపల్లి, వెలుగు: గిరిజనుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం దండేపల్లి మండలం దమ్మన్నపేటను జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్, డీసీపీ ఎ.భాస్కర్, తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండేతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం 2005 కంటే ముందు నుంచి పోడు భూములు సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులకు పట్టాలు అందిస్తామని వెల్లడించారు.

 కొంతమంది గిరిజనులు కొద్దికాలం క్రితం అటవీ భూమిని ఆక్రమించి పోడు వ్యవసాయం సాగు చేస్తూ పట్టాలు ఇవ్వాలని అడగడం సరికాదన్నారు. అర్హులైన గిరిజనులకు అటవీ భూముల్లో వెదురు సాగుకు అవకాశం కల్పిస్తామన్నారు. అవసరమైన మొక్కలు, కూలీల ఖర్చులు ప్రభుత్వం భరించి పంటను అమ్ముకునేందుకు సంస్థలతో ఒప్పందాలు చేయిస్తామని తెలిపారు. కోటపల్లి, వేమనపల్లిలో మల్బరీ సాగుకు రైతులకు శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏసీపీ ప్రకాశ్, జన్నారం ఎఫ్​డీవో రామ్ మోహన్, సీఐ రమణమూర్తి, తాళ్లపేట రేంజ్ ఆఫీసర్ సుష్మరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

జన్నారం, వెలుగు: మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. జన్నారం మండల కేంద్రంలోని బాయ్స్ ఆశ్రమ స్కూల్​ను తనిఖీ చేశారు. క్లాస్ రూముల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. హజరు శాతాన్ని పెంచాలని టీచర్లకు సూచించారు. అనంతరం కవ్వాల్ లోని గర్ల్స్ ఆశ్రమ స్కూల్​ను పరిశీలించారు. తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్ తదితరులున్నారు.