- కలెక్టర్ సిక్తా పట్నాయక్
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: జిల్లాలో మాతృ మరణాలను తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలోని గుండుమాల్, దామరగిద్ద, కోటకొండ, ధన్వాడ, నారాయణపేట అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో జరిగిన 8మాతృ మరణాలపై కలెక్టర్ వివరణ కోరారు. మాతృ మరణాల సంఖ్య తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
మాతృ మరణాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణుల ఆరోగ్యంపై ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించాలని సూచించారు. డీఎంహెచ్వో జయ చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రసూతి మరణాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డీసీహెచ్ మల్లికార్జున్, ఐఎంఏ చైర్మన్ మల్లికార్జున్, డిప్యూటీ డీఎంహెచ్ వో శైలజ, పీవోఎంహెచ్ఎన్ సుధేష్ణ, డీజీవో హెచ్ వోడీ అమిత కుమారి, డాక్టర్లు తేజస్విని పాల్గొన్నారు.
