టీబీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

టీబీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

మిర్యాలగూడ, వెలుగు : రెండు వారాలకు మించి దగ్గు ఉంటే టీబీ టెస్ట్ చేయించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్య సిబ్బందికి సూచించారు. 'టీబీ ముక్త్ భారత్ అభియాన్ ' లో భాగంగా గురువారం మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో  టీబీ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తో కలిసి ఆమె మాట్లాడారు. మిర్యాలగూడ ప్రాంతంలో రైస్ మిల్లులు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక షెడ్యూల్ రూపొందించి రైస్ మిల్ హమాలీలు, డ్రైవర్లు, ప్రజలకు టీబీపై అవగాహన కల్పించాలన్నారు. అక్టోబర్ 2 నాటికి టీబీ రహిత జిల్లాగా నల్గొండను తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

అనంతరం వేములపల్లి మండల కేంద్రంలో కొనసాగుతున్న బీఎల్వోల శిక్షణ, మిర్యాలగూడ పరిధిలోని ఎరువుల గోదాములు , ఎన్ ఎస్పీ క్యాంపులో వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను కలెక్టర్​ పరిశీలించారు. సమావేశంలో డీఎంహెచ్ వో శ్రీనివాస్, జిల్లా టీబీ  నియంత్రణ అధికారి కల్యాణ్ చక్రవర్తి,  జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ మాతృనాయక్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్, మిర్యాలగూడ అధ్యక్షుడు శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ వో వేణుగోపాల్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.