నకిలీ పత్తి సీడ్స్ అమ్మితే జైలుకే : కలెక్టర్ విజయేందిర బోయి

నకిలీ పత్తి సీడ్స్ అమ్మితే జైలుకే : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: నకిలీ  పత్తి విత్తనాలు అమ్మే వారికి జైలు శిక్ష తప్పదని కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు.  శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ జానకితో కలిసి నకిలీ విత్తనాల నియంత్రణకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  నకిలీ విత్తనాలు అమ్మినా, నిల్వ చేసినా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు. 

 నాణ్యమైన పత్తి విత్తనాలను ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేట్లకు అమ్మితే పీడీ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  నేటి నుంచి 28 వరకు16  టాస్క్ పోర్స్ టీమ్ లు జిల్లాలో 259 డీలర్ ఔట్ లెట్ లను తనిఖీ చేయాలని ఆదేశించారు. చెక్ పోస్ట్ ల్లో గట్టి నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించాలని అన్నారు. సమావేశంలో  రెవెన్యూ అడిషనల్  కలెక్టర్ మోహన్ రావు, అడిషనల్  ఎస్పీ రాములు,  డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్, సీఐలు, ఇతర వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. 

నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

జడ్చర్ల, వెలుగు: జడ్చర్ల మండలం గోపాలపూర్ గ్రామంలో శుక్రవారం అక్రమంగా నిల్వ చేసిన పత్తి విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు.  జిల్లా వ్యవసాయ అధికారి బొవోళ్ల వెంకటేశ్ ఆధ్వర్యంలో  దాడులు చేపట్టారు.  గోపాలపూర్ కు చెందిన భవనం మధుసూదన్ రెడ్డి ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 30 ప్యాకెట్ల పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు ఏడీఏ వెంకటేశ్ పోలీసులకు
 ఫిర్యాదు చేశారు.