కాంగ్రెస్ బలం మహిళా ఓటర్లే.. 100 రోజుల్లో వారికి ఎన్నో స్కీమ్​లు

కాంగ్రెస్ బలం మహిళా ఓటర్లే.. 100 రోజుల్లో వారికి ఎన్నో స్కీమ్​లు
  •     ఆరు గ్యారంటీల్లోని ప్రతి స్కీంలో మహిళలకే ప్రాధాన్యం 
  •     ఫ్రీ జర్నీ, సబ్సిడీ సిలిండర్, మహిళా సంఘాలకు బీమా, సున్నా వడ్డీ రుణాలు, మహిళ పేరు మీదే ఇందిరమ్మ ఇల్లు
  •     ఫ్రీ జర్నీ స్కీంలో ఇప్పటి వరకు 35 కోట్ల జీరో టికెట్లు 
  •     వీటితో మహిళలకు రూ.1100 కోట్లు ఆదా

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవడమే టార్గెట్ గా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మహిళల ఓట్లపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేసిన అన్ని స్కీమ్ లలో ప్రధాన లబ్ధిదారులు మహిళలే. ఈ నేపథ్యంలో మహిళ ఓట్లలో మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ కు పడేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రచార వ్యూహం రెడీ చేస్తున్నారు. 100 రోజుల్లో అమలు చేసిన స్కీమ్ లలో లబ్ధిపొందిన మహిళల సంఖ్యను ప్రచారంలో పబ్లిక్ కు వివరించనున్నట్లు తెలుస్తున్నది. స్కీమ్, లబ్ధిపొందిన విధానం ప్రచారంలో చెప్పాలని ఎంపీ అభ్యర్థులకు సీఎం సూచించినట్లు తెలుస్తున్నది. ఇందులో ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ, సబ్సిడీతో గ్యాస్ సిలెండర్, మహిళ సంఘాలకు ఉచిత బీమా, లోన్ బీమా, మహిళ పేరుతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఇలా ప్రతి స్కీమ్ లో మహిళలే భాగస్వామ్యం అవుతున్నారు.

ఫ్రీ బస్ జర్నీతో షురూ

కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 7న అధికారం చేపట్టింది. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే డిసెంబర్ 9 న రెండు స్కీమ్ లను లాంఛ్ చేసింది. ఇందులో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీతో పాటు రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత ట్రీట్ మెంట్ స్కీమ్ లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు డిసెంబర్ 9న అసెంబ్లీ ప్రాంగణంలో లాంచ్ చేశారు. ఫ్రీ జర్నీ స్కీమ్ కింద మహిళలకు ఇప్పటి వరకు 35 కోట్ల జీరో టికెట్లు ఇచ్చినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా మహిళలకు సుమారు రూ.1100 కోట్లు ఆదా అయినట్లు 
సమాచారం. ఆరోగ్యశ్రీలో కూడా లబ్ధిపొందిన వారిలో మహిళలు ఎక్కువ ఉన్నట్లు హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు.

మహిళా సంఘాలకు ఫ్రీ బీమా

రాష్ట్రంలో మహిళా సంఘాల్లో 64 లక్షల 35 వేల మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఖ్యను 1 కోటికి పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల వీరికి రూ.10 లక్షల “గ్రూప్  యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్” ను పరేడ్ గ్రౌండ్ మీటింగ్ లో సీఎం ప్రకటించారు. దీనికి ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. దీంతో పాటు లోన్ తీసుకొని మహిళ సంఘ సభ్యురాలు మరణిస్తే వారి పేరు మీద రూ.2లక్షల లోపు లోన్ ను మాఫీ కానుంది. దీనిని “లోన్ బీమా స్కీమ్” గా సీఎం ప్రకటించారు. అలాగే సున్నా వడ్డీ కింద రుణాలు ఇస్తామని చేవేళ్ల పబ్లిక్ మీటింగ్ లో సీఎం ప్రకటించారు. గత 10 ఏండ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు ఇవ్వకపోవటంతో మహిళా సంఘ సభ్యులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ రెండు స్కీమ్ లు ప్రకటించటంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు సార్లు సీఎం మీటింగ్

100 రోజుల పాలనలో  సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న నాలుగు పబ్లిక్ మీటింగ్ లలో మహిళా సంఘ సభ్యులతో స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మహబూబ్ నగర్, పరేడ్ గ్రౌండ్, అదిలాబాద్, చేవేళ్లలో నిర్వహించిన ఈ సభలకు మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గత 10 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా స్వయంగా సీఎం మహిళ సంఘ సభ్యులతో సమస్యలు, ఇబ్బందులు తెలుసుకోవటంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మహిళ పేరుతో ఇందిరమ్మ ఇండ్లు

ఇందిరమ్మ ఇండ్లను మహిళ పేరుతోనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. స్కీమ్ లాంచ్ చేసిన సమయంలో భద్రాచలం పబ్లిక్ మీటింగ్ లో మహిళకు ఇంటి మంజూరు పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఎంపీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత స్కీమ్ స్పీడప్ కానుంది. ప్రజా పాలనలో మొత్తం 80 లక్షల అప్లికేషన్లు రాగా ఇందులో గతంలో ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వచ్చిన వారి అప్లికేషన్లు సుమారు 18లక్షలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో 65లక్షల అప్లికేషన్లలో లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి, కలెక్టర్ లు ఫైనల్ చేయనున్నారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఇదికూడా ప్లస్ అవుతుందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.