బాకీల బతుకులు: లక్షల కుటుంబాలపై కరోనా ఎఫెక్ట్​

బాకీల బతుకులు: లక్షల కుటుంబాలపై కరోనా ఎఫెక్ట్​

ట్రీట్​మెంట్​ కోసం, కుటుంబపోషణ కోసం అప్పులు
రూ. 10,314 కోట్ల రుణాలు తీసుకున్న డ్వాక్రా గ్రూపు మహిళలు
50% పెరిగిన పర్సనల్, గోల్డ్ లోన్లు నగలు, ఆస్తులు తాకట్టు 

హైదరాబాద్, వెలుగు: ఏడాది నుంచి కరోనా వైరస్ రాష్ట్రంలోని అనేక కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెడుతోంది. మనిషి బతికితే చాలు.. అప్పయితే ఎన్కసిరి అష్టకష్టాలు పడైనా తీర్చుకోవచ్చనే మొండి ధైర్యంతో చాలా మంది దొరికిన చోటల్లా అప్పులు చేస్తున్నారు.  తమవారిని కాపాడుకునేందుకు బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు తీసుకుంటున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులైతే బ్యాంకు లింకేజీ లోన్లను, ఒకటి, రెండు రోజుల్లో చేతికందే స్త్రీ నిధి రుణాలను ఎత్తుకుంటున్నారు. డ్వాక్రా సంఘాల చరిత్రలో ఎన్నడూ లేనంతగా సెర్ప్​​ ఆధ్వర్యంలో 2020–21 ఏడాదిలో రూ. 10,310 కోట్లు లోన్లు తీసుకున్నారు. ఇందులో కరోనా ట్రీట్​మెంట్​ కోసం, కుటుంబపోషణ కోసం తీసుకున్నవే ఎక్కువగా ఉన్నాయి. మరికొందరు బయట సడన్ గా అప్పు పుట్టకపోవడంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. రూ. ఐదు లక్షలలోపు అయితే పర్సనల్ లోన్లు, అంతకు మించితే ఆస్తులను తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటున్నారు. 
ఏ ఇంట చూసినా అప్పులే
పేద, మధ్యతరగతి బతుకులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏడాది నుంచి చేసుకుందామంటే పనులు సరిగ్గా లేక.. ఏ బిజినెస్ కూడా  నడవక లక్షల కుటుంబాలు రోడ్డునపడ్డాయి.   కరోనా సెకండ్ వేవ్​ వల్ల ఇప్పుడు దాదాపు ఏ కుటుంబంలో చూసినా ఒకరో ఇద్దరో కరోనా బారినపడ్డవాళ్లే ఉంటున్నారు. ట్రీట్​మెంట్​ కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. తెలిసినవాళ్ల దగ్గరల్లా అప్పులు చేస్తున్నారు. నగలు, ఆస్తులు తాకట్టు పెడుతున్నారు. కుటుంబ పోషణకు, ఇంటి రెంట్లకు కూడా చాలా మంది అప్పులు చేయాల్సి వస్తోంది.  
డ్వాక్రా గ్రూపుల నుంచి భారీగా లోన్లు
రాష్ట్రంలో గ్రామాల్లోని డ్వాక్రా మహిళలు 2020 –21 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో లోన్లు తీసుకున్నారు. 2018–19లో రూ. 6,200 కోట్లు, 2019 – 20లో రూ.6,500 కోట్లను బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకోగా 2020–21లో రూ. 10,314 కోట్లు రుణాలుగా పొందారు. కరోనా విజృంభించిన ఏడాదిలో  మహిళలు ఒక్కసారిగా 60% లోన్లు అధికంగా తీసుకోవడం వారి కుటుంబ ఆర్థిక అసవరాలకు అద్దం పడుతోందని సెర్ప్ ఉద్యోగి ఒకరు అన్నారు. 

వీరిలో 20 శాతం మంది కరోనాతో వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, హాస్పిటల్ ఖర్చుల కోసం, తమ కుటుంబ సభ్యులు, బంధువుల కోసమే లోన్లు తీసుకున్నట్లు ఐకేపీ ఏపీవో ఒకరు చెప్పారు. ఈ మే నెలలో ఇప్పటికే 300 కోట్ల రుణాలు మహిళా సంఘాలు తీసుకున్నాయి. ఈ నెల చివరి వరకు మరో 700 కోట్ల రుణాలకు సంబంధించి డ్యాక్యుమెంటేషన్​ పూర్తయినట్లు తెలిసింది. ఇప్పుడు సెకండ్ వేవ్​అనేక మంది హాస్పిటళ్లలో అడ్మిట్​ అవుతున్నారని, కుటుంబ సభ్యులకు ట్రీట్​మెంట్​ కోసం డ్వాక్రా మహిళలు లోన్లు తీసుకుంటున్నారని  సెర్ప్​​ ఉద్యోగి ఒకరు చెప్పారు.  
పర్సనల్​, గోల్డ్ లోన్లకు ఫుల్​ డిమాండ్​
సాధారణంగా జనం వద్ద లక్షల్లో లిక్విడ్ క్యాష్ గానీ, బ్యాంకు అకౌంట్లలో నిల్వగానీ ఉండడం చాలా తక్కువ. అత్యవసరానికి లిక్విడ్ క్వాష్ నిల్వ ఉండకపోవడంతో చాలా మంది ఇన్ స్టంట్​గా వచ్చే లోన్ల కోసం పరుగులు తీస్తున్నారు. వచ్చే శాలరీ, ఆదాయాన్ని బట్టి పర్సనల్ లోన్ ఒకటి, రెండు రోజుల్లోనే చేతికి వచ్చే అవకాశం ఉండడంతో ఈ లోన్ తీసుకునేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కొందరు లాక్ డౌన్ తో ఉద్యోగాలు పోవడంతో ఈఎంఐలు కట్టేందుకు, కుటుంబ పోషణకు కూడా లోన్లు తీసుకుంటున్నారు. ఇలా ఒక్కో వ్యక్తి రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పర్సనల్ లోన్లు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ నగరంలో పర్సనల్ లోన్స్ ఇప్పించే బ్యాంకు మధ్యవర్తి ఒకరు వెల్లడించారు. ఒక్కో బ్యాంకులో పర్సనల్ లోన్లు తీసుకుంటున్నవారి సంఖ్య 30 శాతం పెరిగినట్లు హన్మకొండలోని ప్రైవేట్ బ్యాంకు మేనేజర్  చెప్పారు. పర్సనల్ లోన్ ద్వారా వచ్చే మొత్తం సరిపోకపోతే బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటున్నారు. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్ ఆఫీసుకు గోల్డ్​ లోన్​ కోసం గతంలో రోజుకు 30 నుంచి 50 మంది వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య అమాంతం రోజుకు సగటున 100కు పెరిగింది. హాస్పిటల్ అవసరాల కోసం వచ్చేవారే ఎక్కువగా ఉంటున్నట్టు సదరు ఫైనాన్స్ సంస్థ బ్రాంచ్ మేనేజర్ 
వెల్లడించారు.
గోల్డ్ లోన్ తీసుకునెటోళ్లు పెరిగిన్రు
కుటుంబ అవసరాల కోసం చాలా మంది లోన్ కావాలని అడుగుతున్నరు. గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తీసుకునేటోళ్ల సంఖ్య గతంతో పోలిస్తే కరోనా టైంలో బాగా పెరిగింది. తమ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా హాస్పిటల్ లో జాయిన్ అయినప్పుడు కొందరికి బయట ఎక్కడా అప్పు పుట్టడం లేదు. గోల్డ్ లోన్  అప్పటికప్పుడే వచ్చే అవకాశం ఉండడంతో బంగారం కుదవపెట్టి లోన్ తీసుకుంటున్నరు.         - ప్రసాద్, ఇండస్​ ఇండ్ బ్యాంక్ గోల్డ్ లోన్ సేల్స్ ఆఫీసర్
ఇల్లు గడిచేందుకు గోల్డ్ లోన్ తీసుకున్న 
గతంలో ప్రైవేట్ కంపెనీలో పని చేసేవాడ్ని. లాక్ డౌన్ టైంలో ఉద్యోగం పోయింది. ఇంకో ఉద్యోగం ఎక్కడా దొరకలేదు. నాకు డబ్బులు ఇచ్చేటోళ్లు కూడా సమయానికి ఇవ్వడం లేదు. ఉద్యోగం లేకపోవడంతో ఫ్యామిలీని పోషించుకునేందుకు ఆరు తులాల గోల్డ్ కుదవ పెట్టి 2.50 లక్షలు లోన్ తీసుకున్న.  - శివ, హైదరాబాద్