- సీపీ గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశించారు. మంగళవారం కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీసు అధికారులతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంశాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని, నవంబర్ 11 వరకు ప్రక్రియ పూర్తి అవుతుందని వివరించారు.
కమిషనరేట్ కేంద్రంలో ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని, దీనికి అనుభవజ్ఞులైన అధికారులను, సిబ్బందిని కేటాయించామన్నారు. త్వరలో ఆరు- చెక్ పోస్టు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. గత ఎన్నికల ఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల నేరస్తులను, రౌడీ షీటర్లను ఆయా రెవెన్యూ అధికారుల ముందు బైండోవర్ చేయాలని సూచించారు. సరైన ఆధారాలు లేకుండా రూ.50వేల కంటే ఎక్కువ నగదును వెంట తీసుకెళ్లొద్దని సూచించారు. దసరా సందర్భంగా కమిషనరేట్ వ్యాప్తంగా రామ్‌లీలా మైదానాలు, దేవీ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున, రాజకీయ అల్లర్ల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.
